పాకిస్థాన్‌కు అప్పులోళ్ల బాధ... వెంటబడుతున్న గల్ఫ్ దేశాలు!
- 3 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని పాకిస్థాన్‌పై యూఏఈ ఒత్తిడి
- పాకిస్థాన్ పట్ల సహనం కోల్పోతున్న గల్ఫ్ దేశాలు, చైనా
- అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) షరతులను పాటించడంలో పాక్ వైఫల్యం
- పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరలతో సంక్షోభంలో పాక్ ఆర్థిక వ్యవస్థ
దశాబ్దాలుగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ బెయిలవుట్లు, గల్ఫ్ దేశాల డిపాజిట్లు, చైనా రుణాలపైనే ఆధారపడి నడుస్తోంది. ఒక్క చైనాకే పాక్ 25 బిలియన్ డాలర్లకు పైగా బకాయిపడి ఉంది. అయితే, ఈ స్నేహపూర్వక సాయం పాకిస్థాన్‌ను స్వయం సమృద్ధి దిశగా నడిపించలేకపోయిందని 'ఖల్సా వాక్స్' న్యూస్ పోర్టల్ తన కథనంలో విశ్లేషించింది. ప్రభుత్వ రంగంలో అవినీతి, బలహీనమైన పన్నుల వ్యవస్థ, ఇంధన రంగంలో పేరుకుపోయిన అప్పులు, రాజకీయ నాయకుల స్వప్రయోజనాలే దేశాన్ని ఈ దుస్థితికి తెచ్చాయని ఆ కథనం పేర్కొంది.
మరోవైపు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి మరిన్ని నిధులు పొందేందుకు పాక్ ప్రయత్నిస్తున్నా, ఆ సంస్థ విధించిన షరతులను నెరవేర్చడంలో విఫలమవుతోంది. డీజిల్‌పై సబ్సిడీని తొలగించాలని ఐఎంఎఫ్ స్పష్టం చేయగా, పాక్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పెట్రోల్‌పై పన్ను తగ్గించి నిబంధనలను ఉల్లంఘించింది.
ఇరాన్‌లో ఉద్రిక్తతల కారణంగా పెరిగిన చమురు ధరలతో పాక్ దిగుమతుల బిల్లు తలకు మించిన భారంగా మారింది. సరైన ఆర్థిక సంస్కరణలు చేపట్టకుండా, వృథా ఖర్చులను తగ్గించుకోకపోవడం వల్లే పాకిస్థాన్ ఈ సంక్షోభాన్ని స్వయంగా కొనితెచ్చుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.