కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ: కేటీఆర్ కీలక ప్రకటన
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాబోయే పోరాటాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 20న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారని కేటీఆర్ తెలిపారు. అనంతరం ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. మే, జూన్ నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలపై తొలుత దృష్టి సారించబోతున్నట్లు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఏయే ప్రాంతాల్లో ఏయే హామీలు ఇచ్చారో, తిరిగి అదే ప్రాంతాల్లో సభలు పెట్టి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల కోసమే వాడుకుందని మండిపడ్డారు. అంబేద్కర్ పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆయనకు భారతరత్న ఇవ్వడంలోనూ, పార్లమెంటులో ఫొటో పెట్టడంలోనూ కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించకుండా గేట్లు వేస్తే, తాము హెచ్చరించిన తర్వాతే గేట్లు తెరుచుకున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీలు మోసపోయారని, వెయ్యికి పైగా గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనపై బీఆర్ఎస్ గట్టిగా నిలదీస్తుందని అన్నారు.