వైభవంగా గోల్కొండ బోనాల జాతర ప్రారంభం.. బోనం ఎత్తిన కొండా సురేఖ
- అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కొండా సురేఖ, పొన్నం
- ఆలయ కమిటీకి రూ. 11 లక్షల చెక్కు అందజేత
- భక్తి పారవశ్యంతో ఊగిపోతున్న లంగర్ హౌస్ పరిసరాలు
భాగ్యనగర సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల జాతర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య ప్రారంభమైంది. ఈరోజు లంగర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి కొండా సురేఖకు సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తడం విశేషంగా నిలిచింది.
శ్రీ గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా పట్టువస్త్రాలు, మొదటి 'బంగారు బోనం' సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ. 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు.
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీర విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ భక్తి పారవశ్యంతో ఊగిపోయాయి. ఈ వేడుకను కళ్లారా చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆషాఢ బోనాల జాతరకు గోల్కొండ కోట తొలి వేదిక కావడంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. నగర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తును మోహరించారు.