ఇదే చివరి అవకాశం.. పాకిస్థాన్‌కు పీఓకే ఆందోళనకారుల అల్టిమేటం!

This is the last chance PoK protesters give ultimatum to Pakistan
  • జులై 21 వరకు లాంగ్‌మార్చ్‌ను నిలిపివేసిన జేఏఏసీ
  • చర్యలు లేకపోతే జులై 22 నుంచి మార్చ్‌ పునఃప్రారంభిస్తామని హెచ్చరిక
  • పీఓకే ఘర్షణల్లో 30కి చేరిన మరణాల సంఖ్య
  • రోడ్ల దిగ్బంధం, ఇంటర్నెట్‌ నిలిపివేత ఆరోపణలు
  • విదేశాల్లోనూ కశ్మీరీ ప్రవాసుల నిరసనలు
  • పీఓకే పరిస్థితిపై బిలావల్‌ భుట్టో ఆందోళన
పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో కొనసాగుతున్న ఆందోళనలు కీలక మలుపు తిరిగాయి. పాక్‌ ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తున్న ‘జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ’ (జేఏఏసీ) తన లాంగ్‌మార్చ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తమ డిమాండ్లపై చర్యలు తీసుకునేందుకు ఇదే చివరి అవకాశం అంటూ ఇస్లామాబాద్‌కు హెచ్చరిక జారీ చేసింది.

జులై 14తో గడువు ముగియడంతో జేఏఏసీ వేలాది మందితో ముజఫరాబాద్‌ వైపు లాంగ్‌మార్చ్‌కు పిలుపునిచ్చింది. మహిళలు, చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఓకేలోని పలు ప్రాంతాల నుంచి నిరసనకారులు రావల్‌కోట్‌తో పాటు ఇతర నిరసన కేంద్రాలకు చేరుకున్నారు.

ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌ అధికారులతో జేఏఏసీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అనంతరం జేఏఏసీ నాయకుడు ఉమర్‌ నజీర్‌ కశ్మీరీతో జరిగిన చర్చల తర్వాత జులై 21 వరకు లాంగ్‌మార్చ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటిలోగా స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే జులై 22 నుంచి ముజఫరాబాద్‌ వైపు మార్చ్‌ను తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించారు. పీఓకేలో కొనసాగుతున్న ధర్నాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

మరోవైపు రావల్‌కోట్‌ పరిసరాల్లో నిరసనకారులు, పాకిస్థాన్‌ భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణాల సంఖ్య 30కు చేరినట్లు సమాచారం. ఒక్క ఘటనలోనే జేఏఏసీకి చెందిన ఏడుగురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. రహదారులు మూసివేయడం, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం, సరఫరాలను అడ్డుకోవడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

విదేశాల్లోని కశ్మీరీ ప్రవాసులు కూడా పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ కూడా పీఓకే పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

పీఓకేలో ఆరు వారాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వేలాది మంది రావల్‌కోట్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. జేఏఏసీ నేత సర్దార్‌ అమ్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. పీఓకేను ‘వివాదాస్పద ప్రాంతం’గా కాకుండా ‘బలవంతంగా ఆక్రమించిన భూభాగం’గా పేర్కొనాలని పిలుపునిచ్చారు. పీఓకేలో కర్ఫ్యూ, దిగ్బంధం, కమ్యూనికేషన్‌ సేవల నిలిపివేత మధ్య పాకిస్థాన్‌ బలగాలు పౌరులపై కఠిన చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
Advertisement
Joint Awami Action Committee
Pakistan Occupied Kashmir Protests
Muzaffarabad Long March
PoK JAAC Ultimatum
Pakistan Army Chief Asim Munir
Rawalakot Unrest

More Telugu News