సక్సెస్ స్కూల్‌లో 'కల్మా' కలకలం.. కాంగ్రెస్ పై రాంచందర్ రావు ఫైర్

Success School Kalma controversy Ramchander Rao slams Congress party
  • సైదాబాద్‌లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఘటన
  • ఇస్లామిక్ సూక్తులు నేర్చుకోవాలంటూ హిందూ విద్యార్థికి హోంవర్క్
  • డైరీని గమనించి షాక్ కు గురైన తల్లిదండ్రులు
  • స్కూలు గుర్తింపు రద్దు చేయాలన్న రాంచందర్ రావు 

హైదరాబాద్‌ పాతబస్తీ పరిధిలోని సైదాబాద్‌లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. అక్కడి 'సక్సెస్ స్కూల్'లో రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి... ఇస్లామిక్ పవిత్ర సూక్తులైన 'కల్మా', 'సూరహ్ అల్-ఫాతిహా' చదివి, నేర్చుకు రావాలంటూ ఉపాధ్యాయురాలు హోంవర్క్ ఇవ్వడం, స్కూల్ డైరీలో లిఖితపూర్వకంగా రాయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


బాలుడు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత డైరీని గమనించిన తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్న వయసులోనే విద్యార్థులపై ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంధువులు, స్థానికులతో కలిసి నేరుగా స్కూల్‌కు వెళ్లి యాజమాన్యాన్ని సూటిగా నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. బాధితులు వెంటనే సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


విషయం వెలుగులోకి రాగానే అలర్ట్ అయిన సక్సెస్ స్కూల్ యాజమాన్యం.. ఇది సదరు టీచర్ వ్యక్తిగతంగా చేసిన పొరపాటుగా భావిస్తున్నామని పేర్కొంది. ఈ వివాదానికి కారణమైన ఉపాధ్యాయురాలు షేక్ ఆయిషా పర్వీన్‌ను తక్షణమే విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో తమ విద్యాసంస్థల్లో ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని, పాఠశాలలో ఇలాంటి మతపరమైన బోధనలకు తావు లేదని స్పష్టం చేసింది.


ఈ ఉదంతంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అత్యంత తీవ్రంగా స్పందించారు. 'కాంగ్రెస్ అంటే ముస్లింలు' అనే ప్రకటనల వల్లే ఇలాంటి శక్తులకు ప్రోత్సాహం లభిస్తోందని మండిపడ్డారు. స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ... చిన్నారిపై మతపరమైన ఒత్తిడి తీసుకురావడం ఘోరమని, జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement
Success School
Kalma controversy Hyderabad
Saidabad school incident
BJP Ramchander Rao
MLA Raja Singh
Hyderabad private school news

More Telugu News