టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. మేజర్ లీగ్ క్రికెట్‌లో వ‌ర‌ల్డ్ రికార్డ్స్ బ‌ద్ద‌లు

Washington Freedom creates new history in T20 cricket by breaking world records in Major League Cricket
  • ఎంఎల్‌సీ ఎలిమినేటర్‌లో ఎంఐ న్యూయార్క్‌పై వాషింగ్టన్ ఫ్రీడమ్ ఘన విజయం
  • టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ప్రపంచ రికార్డు
  • విధ్వంసక సెంచరీలతో కదం తొక్కిన స్టీవ్ స్మిత్, ఆండ్రీస్ గౌస్
  • పూరన్ ఫాస్టెస్ట్ సెంచరీ, పొలార్డ్ 1000 సిక్సర్ల మైలురాయి వృథా
  • ఛాలెంజర్ మ్యాచ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోతో తలపడనున్న వాషింగ్టన్
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2026 సీజన్‌లో పరుగుల సునామీ సృష్టించిన వాషింగ్టన్ ఫ్రీడమ్, టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (110 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ న్యూయార్క్‌పై 6 వికెట్ల తేడాతో వాషింగ్టన్ చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో వాషింగ్టన్ జట్టు ఛాలెంజర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్, నికోలస్ పూరన్ (31 బంతుల్లో 100) మెరుపు సెంచరీతో నిర్ణీత ఓవర్లలో 266 పరుగుల భారీ స్కోరు సాధించింది. పూరన్ ఎంఎల్‌సీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. అతనికి తోడుగా కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 64) కూడా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో పొలార్డ్ టీ20 క్రికెట్‌లో 1,000 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా (క్రిస్ గేల్ తర్వాత) రికార్డు సృష్టించాడు.

267 పరుగుల అసాధ్యమనుకున్న లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్, ఆరంభంలో 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ ఆండ్రీస్ గౌస్ (51 బంతుల్లో 132) కలిసి విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 110 పరుగులు చేసిన స్మిత్ అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. దీంతో వాషింగ్టన్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు టీ20ల్లో అత్యధిక ఛేదన రికార్డు (265) ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పేరిట ఉండేది. ఇప్పుడు వాషింగ్టన్ ఆ రికార్డును బద్దలుకొట్టింది.

గతేడాది ఫైనల్‌లో ఎంఐ న్యూయార్క్ చేతిలో ఓటమి పాలైన వాషింగ్టన్, ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ‌ జరిగే ఛాలెంజర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఈ నెల‌ 18న జరిగే ఫైనల్‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ను ఢీకొంటుంది.
Advertisement
Washington Freedom
Steve Smith
Major League Cricket
Nicholas Pooran
T20 World Record
MI New York

More Telugu News