గూగుల్ జెమినై కొత్త ఫీచర్.. నీట్ అభ్యర్థుల కోసం పూర్తిస్థాయి ప్రాక్టీస్ టెస్టులు

Google Gemini Launches NEET Practice Tests for Students
టెక్ దిగ్గజం గూగుల్, భారతదేశంలోని వైద్య విద్య అభ్యర్థులకు అండగా నిలుస్తూ కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లాట్‌ఫామ్ అయిన జెమినైలో నీట్ యూజీ (NEET UG) కోసం పూర్తిస్థాయి ప్రాక్టీస్ టెస్టులను ప్రవేశపెట్టింది. వాస్తవ పరీక్ష వాతావరణాన్ని తలపించేలా ఈ మాక్ టెస్టులను రూపొందించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన శిక్షణ అనుభవాన్ని అందించడమే లక్ష్యమని కంపెనీ పేర్కొంది.

గూగుల్ జెమినైలో ఈ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. 'Take a NEET mock test' అని ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఈ ప్రాక్టీస్ టెస్టులను ప్రారంభించవచ్చు. వివిధ విద్యా వేదికల నుంచి సేకరించిన, నిపుణులతో ధృవీకరించబడిన నాణ్యమైన కంటెంట్‌తో ఈ టెస్టులను రూపొందించారు. ప్రస్తుతం ఈ సదుపాయం ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంది. గూగుల్ అకౌంట్ ఉన్న వినియోగదారులతో పాటు వర్క్‌స్పేస్ సబ్‌స్క్రైబర్లు కూడా ఈ టెస్టులను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్టుల ప్రత్యేకత ఏమిటంటే, పరీక్ష పూర్తయిన వెంటనే తక్షణ ఫీడ్‌బ్యాక్ లభిస్తుంది. విద్యార్థుల బలాలు, బలహీనతలను ఇది స్పష్టంగా విశ్లేషిస్తుంది. అంతేగాక‌ సమాధానాలను మరింత వివరంగా చెప్ప‌మ‌ని ఏఐ అసిస్టెంట్‌ను అడగవచ్చు. విద్యార్థుల పనితీరు ఆధారంగా పర్సనలైజ్డ్ స్టడీ ప్లాన్‌లను కూడా జెమినై రూపొందిస్తుంది. తద్వారా విద్యార్థులు తమ నాలెడ్జ్ గ్యాప్స్‌ను గుర్తించి, ఫలితాలను మెరుగుపరుచుకునేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం గూగుల్ తన ఏఐ టూల్స్‌ను విస్తరించడంలో భాగంగానే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ వంటి వాటి కోసం పూర్తిస్థాయి ప్రాక్టీస్ టెస్టులను అందిస్తోంది. దీంతో పాటు స్టడీ గైడ్స్, క్విజ్‌లు, ఇతర లెర్నింగ్ మెటీరియల్‌ను సృష్టించేందుకు కూడా ఏఐ ఫీచర్లను అందిస్తోంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అసైన్‌మెంట్లు రూపొందించడానికి, విద్యార్థుల పనితీరును సమీక్షించడానికి, వ్యక్తిగత ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి కూడా గూగుల్ ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి కట్టుబడి ఉన్నామని, డిజిటల్ లెర్నింగ్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు కృషి చేస్తున్నామని గూగుల్ స్పష్టం చేసింది.
Go Back to Shorts
Google Gemini
NEET UG
NEET practice tests
artificial intelligence
AI learning
medical entrance exam
JEE Main
online education
Google AI tools

More Telugu News