బౌలర్‌ను కాదు.. బంతిని చూసి ఆడతా: వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi I Watch The Ball Not The Bowler
షార్ట్స్‌లో చూడండి
క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోతున్నాడు!
కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్‌ను ఐపీఎల్ మ్యాచ్ లో ఊచ‌కోత కోశాడు. నిన్న‌ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని వీరవిహారం చేశాడు. 
ఒకే ఓవర్‌లో నాలుగు వరుస బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సహా కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, తాను బౌలర్‌ను చూసి కాకుండా బంతిని చూసి ఆడతానని ఈ యువ కెరటం ధీమాగా చెప్పాడు.

"ప్రముఖ బౌలర్ (బుమ్రా లేదా హేజిల్‌వుడ్) బౌలింగ్ చేస్తున్నాడని మనసులో ఉన్నప్పటికీ, నేను బంతిని మాత్రమే చూసి ఆడతాను, బౌలర్‌ను కాదు. ప్రాక్టీస్‌లో నేర్చుకున్న నైపుణ్యాలనే మ్యాచ్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తాను" అని మ్యాచ్ అనంతరం సూర్యవంశీ తెలిపాడు.

చిన్న వయసులోనే స్టార్‌డమ్ వచ్చినా తన కాళ్లు నేలపైనే ఉన్నాయని సూర్యవంశీ అన్నాడు. తన తండ్రి సంజీవ్, రాజస్థాన్ జట్టు సహాయక సిబ్బంది రోమీ భిందర్ ఎల్లప్పుడూ సరైన సలహాలిస్తూ తనను సరైన మార్గంలో నడిపిస్తున్నారని చెప్పాడు. 78 పరుగుల వద్ద ఔటవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అతను.. "నేను చివరి వరకు ఉండుంటే మరో 20 పరుగులు చేసేవాడిని, అది జట్టుకు మరింత ఉపయోగపడేది" అని వ్యాఖ్యానించడం అతని పరిణతికి నిదర్శనం.

ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడుగా, ధ్రువ్ జురెల్ (81 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మధ్య 108 పరుగుల భాగస్వామ్యం రాజస్థాన్ విజయాన్ని సులభతరం చేసింది. చివర్లో రవీంద్ర జడేజా (24 నాటౌట్) వేగంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి అజేయంగా నిలవగా, ఈ సీజన్‌లో బెంగళూరుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
IPL 2026
Rajasthan Royals
RCB vs RR
Josh Hazlewood
Dhruv Jurel
Ravindra Jadeja
Cricket
Indian Premier League
RR vs RCB

More Telugu News