పటీదార్ దూకుడు... రాణించిన కోహ్లీ, అయ్యర్, షెపర్డ్... ఆర్సీబీ భారీ స్కోరు

Rajat Patidar blitz helps RCB post big score against RR
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, కెప్టెన్ రజత్ పటీదార్ (63) అద్భుత హాఫ్ సెంచరీకి తోడు చివర్లో బ్యాటర్లు మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 202 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఉంచింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా, విరాట్ కోహ్లీ (32) ఎదురుదాడికి దిగాడు. కేవలం 16 బంతుల్లో 7 ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి దేవదత్ పడిక్కల్ (14) జత కలవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 61 పరుగులు చేసింది.

అయితే, పవర్‌ప్లే తర్వాత రాజస్థాన్ బౌలర్లు పుంజుకున్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో దూకుడుగా ఆడుతున్న కోహ్లీతో పాటు కృనాల్ పాండ్యా (1)ను ఔట్ చేసి ఆర్సీబీని దెబ్బతీశాడు. ఆ తర్వాత జితేశ్ శర్మ (5), టిమ్ డేవిడ్ (13) కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో బెంగళూరు 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ రజత్ పటీదార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు సంయమనంతో ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ స్కోరు 200 పరుగుల మార్కును దాటింది. రొమారియో షెపర్ట్ 11 బంతుల్లో 22 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Go Back to Shorts
Rajat Patidar
RCB vs RR
Royal Challengers Bangalore
Rajasthan Royals
IPL 2026
Virat Kohli
Venkatesh Iyer
Romario Shepherd
Cricket
T20

More Telugu News