దాడికి 90 నిమిషాల ముందు యూ టర్న్... ప్రపంచానికి ఊరటనిచ్చిన ట్రంప్ నిర్ణయం!

Donald Trump Halts Iran Strike 90 Minutes Before Deadline
షార్ట్స్‌లో చూడండి
గడువు ముగుస్తుండటంతో అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య పోరు ఖాయమని ప్రపంచమంతా బిగబట్టిన ఊపిరితో చూస్తున్న వేళ... డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై సైనిక దాడికి తాను నిర్దేశించుకున్న గడువుకు సరిగ్గా 90 నిమిషాల ముందు, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి పెను సంక్షోభాన్ని నివారించారు. ఈ కీలక నిర్ణయంతో పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి వీడిపోవడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

తెరవెనుక పాకిస్థాన్ సాగించిన దౌత్యం ఫలితంగానే ఈ 'ద్వైపాక్షిక కాల్పుల విరమణ' సాధ్యమైందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో వెల్లడించారు. రెండు వారాల పాటు ఈ విరామం ఉంటుందని, అయితే ఇందుకు ప్రతిగా ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలని ఆయన షరతు విధించారు. "మా సైనిక లక్ష్యాలు ఇప్పటికే నెరవేరాయి. ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి కోసం ఇది ఒక ముందడుగు" అని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ ప్రకటనకు ముందు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికా దాడికి సిద్ధమైందన్న సంకేతాలతో యావత్ ప్రపంచం భయాందోళనలకు గురైంది. ఈ క్లిష్ట సమయంలో పాకిస్థాన్ జరిపిన మంత్రాంగం కీలక పాత్ర పోషించినట్లు దౌత్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదనపై ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. "మాపై దాడులు ఆగితే, మా రక్షణ చర్యలను నిలిపివేస్తాం" అని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ రెండు వారాల విరామానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. చర్చల కోసం ఇరాన్ నుంచి తమకు 10-సూత్రాల ప్రతిపాదన అందిందని, ఇది శుభపరిణామమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి దాడులు ఆగడంతో దౌత్యానికి మార్గం సుగమమైనప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా విధించిన కఠిన ఆంక్షల వంటి అనేక వివాదాస్పద అంశాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 
Go Back to Shorts
Donald Trump
Iran
US Iran conflict
Pakistan diplomacy
Hormuz Strait
Military strike
Peace talks
Nuclear program
Sanctions
Middle East crisis

More Telugu News