Ritika Rai: బెంగళూరు జైల్లోకి సిమ్ కార్డులు చేరవేస్తూ పట్టుబడిన యువతి

Ritika Rai Arrested for Smuggling SIM Cards into Bangalore Jail
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరు సెంట్రల్ జైల్లోకి మాదకద్రవ్యాలు, సిమ్ కార్డులను అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని రితికా రాయ్ (27)గా గుర్తించారు. మార్చి 26న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే, పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ఫర్హాన్ ఖాన్‌ను కలిసేందుకు రితికా రాయ్ విజిటర్ పాస్ తీసుకుంది. జైల్లోని జనరల్ ఇంటర్వ్యూ సెక్షన్‌లో సందర్శకులను తనిఖీ చేస్తుండగా, డ్యూటీలో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు రితికాపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను పక్కనే ఉన్న తనిఖీ గదికి తీసుకెళ్లి క్షుణ్ణంగా సోదా చేయగా అసలు విషయం బయటపడింది. తన మర్మాంగాలలో మూడు ప్యాకెట్లలో నిషేధిత పదార్థాలు, మూడు ఎయిర్‌టెల్ 5జీ సిమ్ కార్డులను దాచిపెట్టినట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లలో సుమారు 30 గ్రాముల గంజాయితో పాటు, మరో 30 గ్రాముల ఇతర మాదకద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీనియర్ జైలు అధికారుల సమక్షంలో ఈ వస్తువులను సీజ్ చేసి, తదుపరి పరీక్షల నిమిత్తం పంపించారు. భద్రతా తనిఖీలను దాటుకుని ఖైదీకి ఈ వస్తువులను చేరవేయాలని రితికా ప్రయత్నించినట్లు స్పష్టమైంది. ఈ ఘటనపై డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కర్ణాటక జైళ్ల (సవరణ) చట్టం, 2022, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద రితికా రాయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సిబ్బంది వాంగ్మూలాలు, ఖైదీ వివరాలు, విజిటర్ పాస్ వంటి పత్రాలను కూడా సమర్పించారు.

బెంగళూరు జైలులో స్మగ్లింగ్ యత్నాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు సిబ్బందే ఇలాంటి పనులకు పాల్పడి పట్టుబడ్డారు. ఇదే నెలలో, మార్చి 12న, ఓ జైలు వార్డెన్ ఖైదీలకు డ్రగ్స్ అందించేందుకు ప్రయత్నిస్తూ అరెస్టయ్యాడు. అతని వద్ద నుంచి గంజాయి, స్మోకింగ్ పైప్, మెథాంపెటమైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అంతకుముందు, 2025 డిసెంబర్ 7న, రాహుల్ పాటిల్ అనే మరో వార్డెన్ తన లోదుస్తులలో నిషేధిత వస్తువులను దాచిపెట్టి హై-సెక్యూరిటీ జైల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. మెయిన్ గేట్ వద్ద మెటల్ డిటెక్టర్ పదేపదే మోగడంతో భద్రతా సిబ్బంది అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, సిగరెట్ ప్యాకెట్లు, దాదాపు 60 గ్రాముల పేపర్ రూపంలోని నార్కోటిక్ పదార్థం బయటపడింది. ఇలా వరుస ఘటనలు జైలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రస్తుత ఘటనపై అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
Go Back to Shorts
Ritika Rai
Bangalore jail
smuggling
sim cards
drugs
ganja
Karnataka
Farhan Khan
prison security
NDPS Act

More Telugu News