Nara Lokesh: తిరుపతిలో వెయ్యి కోట్ల భూదందా.. సూత్రధారి, పాత్రధారి నారా లోకేశ్: భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతిలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కూటమి ప్రభుత్వం కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి నారా లోకేశ్ సూత్రధారి, పాత్రధారి అని ఆయన ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ఆరోపణలు గుప్పించారు.
తిరుపతి నడిబొడ్డున ఉన్న 22 ఎకరాల విలువైన భూమిని కేవలం 94 కోట్ల రూపాయలకే రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించారని భూమన ఆరోపించారు. "దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ (బెంగళూరు), సైబర్ సిటీ డెవలపర్ (హైదరాబాద్) సంస్థలకు ఎటువంటి బహిరంగ ప్రకటన లేకుండానే భూములు దోచిపెట్టారు. ఈ సంస్థల్లో లోకేశ్ భాగస్వామిగా ఉన్నారా? లేక ఇవి ఆయన బినామీ సంస్థలా?" అని ప్రశ్నించారు. ఈ ఒప్పందం వెనుక సుమారు 300 నుంచి 400 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు అమ్మడమే కాకుండా, సదరు సంస్థలకు అసాధారణ రాయితీలు కల్పించారని భూమన విమర్శించారు. 15 ఏళ్ల పాటు ఏపీ జీఎస్టీ ప్రోత్సాహకాలు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ కల్పించారని అన్నారు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. సాధారణంగా టూరిజం ప్రాజెక్టులను పీపీపీ విధానంలో ఇస్తారని, కానీ ఇక్కడ 'ఫ్రీ హోల్డ్' విధానంలో కట్టబెట్టడం వెనుక పెద్ద మతలబు ఉందని ఆరోపించారు.
ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు వందల కోట్ల విలువైన భూములు కేటాయించడంలో ఆంతర్యమేమిటని భూమన ప్రశ్నించారు. తిరుపతి ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ భూదందాను అడ్డుకుని తీరుతామని ఆయన హెచ్చరించారు.