నీట్, జేఈఈ అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50 శాతం వెయిటేజీ?
- ఏ ఒక్క పరీక్షపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడకుండా చర్యలు
- ప్రవేశ పరీక్షలను స్కూల్ సిలబస్‌కు అనుగుణంగా మార్చే యోచన
- విద్యార్థులకు బహుళ ప్రయత్నాల అవకాశం కల్పించే ప్రతిపాదన
- కంప్యూటర్ ఆధారిత ఆన్-డిమాండ్ పరీక్షలపై కూడా చర్చ
ఇటీవల పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల లీకులు, మూల్యాంకన లోపాలు వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రవేశ విధానంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లు పూర్తిగా నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల మార్కుల ఆధారంగానే జరుగుతున్నాయి. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే బోర్డు పరీక్ష మార్కులు కూడా మెరిట్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అలాగే ప్రవేశ పరీక్షలను స్కూల్ సిలబస్‌కు మరింత దగ్గర చేయడం ద్వారా కోచింగ్ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
విద్యార్థులు ఏడాది పొడవునా ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పించడం, భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత అడాప్టివ్ ఆన్-డిమాండ్ పరీక్షల వైపు క్రమంగా మారడం వంటి సంస్కరణలపై కూడా చర్చ జరుగుతోంది. కోచింగ్ సెంటర్లపై ఆధారపడటం, డమ్మీ స్కూళ్ల పెరుగుదల, ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత వంటి అంశాలను పరిశీలించేందుకు గత ఏడాది కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల కమిటీ ఈ సంస్కరణలను పరిశీలిస్తోంది.