వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, మల్లాది విష్ణు, జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, వైసీపీ అధినేత జగన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. "ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడని మహోన్నతుడు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఎక్స్ వేదికగా ఆయన శ్రీరామనవమి సందేశాన్ని ఇచ్చారు.