Telangana: 'అమ్మానాన్న లేరు.. కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి స‌ర్‌': ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ వైరల్‌!

Telangana Students Emotional Plea on Answer Sheet Goes Viral
షార్ట్స్‌లో చూడండి
పరీక్షల్లో జవాబులు రాకపోతే కొందరు విద్యార్థులు పాస్ చేయమంటూ ప్రాధేయపడటం, జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టడం వంటివి చూస్తుంటాం. కానీ, తెలంగాణకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి మరో అడుగు ముందుకేశాడు. తనను పాస్ చేయాలంటూ జవాబు పత్రంలో ఏకంగా బొమ్మలు గీసి, దీనంగా వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ ఆన్సర్ షీట్‌ను పేపర్ దిద్దే ఓ ఎగ్జామినర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది.

ఇటీవల తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగియడంతో ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి రాసిన సమాధాన పత్రం చూసి ఎగ్జామినర్ ఆశ్చర్యపోయారు. ఆ విద్యార్థి 'సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి' అని వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఓ గురువు కాళ్లపై శిష్యుడు పడి నమస్కరిస్తున్నట్టుగా బొమ్మ గీశాడు. ఆ గురువు కింద 'సార్' అని, శిష్యుడి కింద 'నేను' అని రాసి తన సృజనాత్మకతను ప్రదర్శించాడు.

కేవలం బొమ్మలతోనే సరిపెట్టకుండా, ఎగ్జామినర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు భావోద్వేగ అస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. తనకు అమ్మానాన్న లేరని, గురువులే తనకు తల్లిదండ్రులని పేర్కొన్నాడు. అంతేకాదు 'దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను.. ఆ దేవుడు కూడా మీరే సార్' అంటూ ఎగ్జామినర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. తాను ఎంతో కష్టపడి చదివిన ప్రశ్నలేవీ పరీక్షలో రాలేదని కూడా తన ఆవేదనను వెలిబుచ్చాడు.

తనను ఈ ఒక్కసారికి పాస్ చేస్తే ఆ మేలు మర్చిపోనని, దయచేసి పాస్ చేయాలని 'ప్లీజ్ సార్' అంటూ పదే పదే అభ్యర్థించాడు. పరీక్షల్లో సమాధానాలకు బదులుగా ఇలాంటి వింత సమాధానాలు, వేడుకోళ్లు రాయడం కొత్త కానప్పటికీ, ఈ విద్యార్థి చూపిన క్రియేటివిటీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 
Go Back to Shorts
Telangana
Inter Student
Inter Exams
Answer Sheet
Viral
Student Request
Pass me sir
Exam Paper
Education
Social Media

More Telugu News