Avi Loeb: అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?

Mars Mystery Object Avi Loeb Urges NASA Investigation
షార్ట్స్‌లో చూడండి
అంగారక గ్రహంపై కనుగొన్న ఓ మిస్టీరియస్ వస్తువు ఇప్పుడు శాస్త్రవేత్తల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ 2022లో తీసిన ఒక ఫొటోలో మెరుస్తున్న సిలిండర్ ఆకారంలోని వస్తువు కనిపించగా, దీనిపై తక్షణమే దర్యాప్తు జరపాలని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ అవి లోయెబ్ నాసాను డిమాండ్ చేస్తున్నారు. దాని మూలాన్ని తేల్చేందుకు రోవర్‌ను వెనక్కి పంపాలని ఆయన సూచించారు.

ఈ ఫొటోను క్యూరియాసిటీ రోవర్‌లోని మాస్ట్ కెమెరా 2022 ఆగస్టు 7న మార్స్‌పై ఉన్న గేల్ క్రేటర్‌లోని పారైటెపుయ్ పాస్ అనే ప్రాంతంలో చిత్రీకరించింది. సుమారు 20 సెంటీమీటర్ల పొడవున్న ఈ వస్తువు, గుండ్రని సిలిండర్ ఆకారంలో ఉంది. దాని ఉపరితలం మెరుస్తూ ఉండటంతో, చుట్టూ ఉన్న రాతి నేలపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ ఫొటో పాతదే అయినా, నాసా ఆర్కైవ్‌లో దీనిని అమెచ్యూర్ మార్స్ పరిశోధకుడు రామి బార్ ఇలాన్ గుర్తించారు. అనంతరం, ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ జాన్ స్పేసెక్ దీనిని అవి లోయెబ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంపై అవి లోయెబ్ మాట్లాడుతూ, "ఈ మిస్టీరియస్ సిలిండర్‌ను మానవ నిర్మిత శిథిలాలుగా భావించి వదిలేయాలా? లేక దాని అసలు మూలాన్ని తెలుసుకునేందుకు రోవర్‌ను వెనక్కి పంపాలా?" అని ప్రశ్నించారు. అంతేకాకుండా, న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరింత స్పష్టంగా తన అభిప్రాయం తెలిపారు. "ప్రస్తుతం క్యూరియాసిటీ రోవర్ చేస్తున్న సాధారణ పనుల కన్నా ఈ సిలిండర్‌ను పరిశీలించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నాసా నడిచేది పన్ను చెల్లింపుదారుల డబ్బుతోనే. ఈ మిస్టరీ వస్తువు మూలాన్ని తెలుసుకోవడమే రోవర్ ప్రథమ కర్తవ్యం కావాలని ప్రజలు కోరుకుంటారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ఈ వస్తువు మానవ నిర్మిత పరికరాలకు చెందిన శకలమే అనడానికి ఎక్కువ అవకాశం ఉందని స్వయంగా లోయెబ్ అంగీకరించారు. క్యూరియాసిటీ రోవర్ ల్యాండింగ్ సమయంలో ఉపయోగించిన స్కై క్రేన్, హీట్ షీల్డ్ లేదా రోవర్ నుంచి ఊడిపడిన ఏదైనా పరికరం లేదా వైర్ ముక్క అయి ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ఇది గాలికి కొట్టుకుపోయి ఆ ప్రదేశంలో పడి ఉండొచ్చని తెలిపారు. అవి లోయెబ్ డిమాండ్‌పై నాసా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో కూడా క్యూరియాసిటీ రోవర్ పలు ఆసక్తికర విషయాలను కనుగొన్నప్పటికీ, ఈ మెరుస్తున్న వస్తువు మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది.
Go Back to Shorts
Avi Loeb
Mars
Curiosity Rover
NASA
Pareitepuy Pass
Gale Crater
Mars mystery object
space exploration
astrofísica
Rami Bar Ilan

More Telugu News