అమెరికాలో జరిగిన 2026 మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ యూఎస్ కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోనూ పట్టు సాధించింది. సెనేట్‌లో 5 సీట్లు, ప్రతినిధుల సభ (హౌస్)లో అరడజనుకు పైగా స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌పై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ ఎన్నికల్లో తననే బ్యాలెట్‌పై ఉన్న అభ్యర్థిగా భావించి ఓటు వేయాలని ట్రంప్ ప్రజలను కోరిన నేపథ్యంలో ఈ ఫలితాలు ఆయన విధానాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరల పెరుగుదల, ఇరాన్‌తో యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు, వాణిజ్య సుంకాల (టారిఫ్‌లు) విధానాలు రిపబ్లికన్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయి. 

ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోవడం కూడా ఈ ఫలితాలకు కారణమైంది. అధిక ధరలకు ట్రంప్ ప్రభుత్వమే కారణమని చాలా మంది ఓటర్లు భావిస్తున్నారని, అధ్యక్షుడి అధికారాలకు కాంగ్రెస్ ద్వారా అడ్డుకట్ట వేయాలని వారు కోరుకుంటున్నారని ‘ది ఏపీ ఓటర్ పోల్’ సర్వేలో వెల్లడైంది.

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?
అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు పూర్తి ఆధిపత్యం సాధించడం భారత్‌పై కచ్చితంగా ప్రభావం చూపే కీలక పరిణామం. చట్టాల రూపకల్పన, ప్రభుత్వ విధానాలపై దర్యాప్తులు, నిధుల కేటాయింపు వంటి అంశాల్లో డెమొక్రాట్ల బలం పెరగనుంది. అయితే, విదేశాంగ విధానంలో అధ్యక్షుడిదే తుది నిర్ణయం కావడం, వీటో వంటి అధికారాలు ట్రంప్ వద్దే ఉండటంతో మార్పులు అంత సులభం కాకపోవచ్చు. అయినప్పటికీ, భారత ఎగుమతులు, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, ద్వైపాక్షిక రక్షణ సహకారం వంటి అంశాలపై ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

వాణిజ్యం, టారిఫ్‌లు
భారత్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అందువల్ల అక్కడి టారిఫ్ విధానాల్లో ఏ చిన్న మార్పు జరిగినా అది భారత ఎగుమతులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించాయి. దీని కింద భారత ఉత్పత్తులపై 18% టారిఫ్‌లు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. అయితే, వాణిజ్య భాగస్వాములపై అత్యవసర అధికారాలను ఉపయోగించి ట్రంప్ విధించిన టారిఫ్‌లను యూఎస్ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ప్రస్తుతం ఈ సుంకాలు 10 శాతానికి తగ్గాయి.

భారత్-అమెరికా మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అయితే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దశకు చేరుకుందని చెప్పడం గమనార్హం. డెమొక్రాట్ల నియంత్రణతో ఈ ఒప్పందాలపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.

హెచ్-1బీ వీసాలు.. వలస విధానాలు
ఈ ఎన్నికల ఫలితాలు అమెరికాలో, ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయ నిపుణులపై ప్రభావం చూపవచ్చు. కాంగ్రెస్‌లో ఆధిపత్యం మారడంతో భవిష్యత్తులో వలస చట్టాలపై చర్చ, పర్యవేక్షణ పెరగనుంది. అయితే, వీసా నిబంధనల్లో తక్షణ మార్పులు ఉండకపోవచ్చు. డెమొక్రాట్ల విజయం వల్ల వలస విధానాలపై కాంగ్రెస్ పర్యవేక్షణ పెరిగి, రిపబ్లికన్లు ప్రతిపాదించిన కొన్ని కఠిన నిబంధనలు నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ, కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులకు 100,000 డాల‌ర్ల‌ ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్ అధ్యక్ష ప్రకటన వంటివి రద్దు కావడం అంత సులభం కాదు.

మొత్తం మీద డెమొక్రాట్లు ఉభయ సభల్లో గెలిచినప్పటికీ, ట్రంప్ వీటో అధికారం, సెనేట్‌లోని ఫిలిబస్టర్ నిబంధనలు వారి దూకుడుకు అడ్డుకట్ట వేయనున్నాయి. డెమొక్రాట్లు కాంగ్రెస్‌ను గెలిచినా ట్రంప్ అజెండాను అడ్డుకోవడానికి వారు చేయగలిగింది చాలా తక్కువేనని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వ్యాఖ్యానించడం ప్రస్తుత రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది.