Bangalore House Owners: బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం... రూ.70 వేల డిపాజిట్‌లో రూ.52 వేలు కట్.. యువతి వీడియో వైరల్!

Bangalore House Owners Cut 52000 From Deposit Viral Video
షార్ట్స్‌లో చూడండి
టెక్ హబ్ బెంగళూరులో ఇంటి యజమానుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అద్దెకు ఉంటున్న ఒక యువతి సెక్యూరిటీ డిపాజిట్ నుంచి ఏకంగా రూ.52,000 అన్యాయంగా కట్ చేసుకున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. యశవంత్‌పూర్‌లోని 'ఆర్గే అర్బన్ బ్లూమ్' అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు ఒక 3BHK ఫ్లాట్‌లో అద్దెకు దిగేటప్పుడు ఇంటి యజమానులైన వీరేంద్ర పి. ఖట్వకర్, రేఖా వి. ఖట్వకర్‌లకు రూ.70,000 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. ఇటీవల యజమానులు ఆ ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టడంతో ఆమెను ఇల్లు ఖాళీ చేయమని కోరారు. ఒప్పందం ప్రకారం ఆమె ఫ్లాట్ ఖాళీ చేసిన తర్వాత, యజమానులు కేవలం రూ.18,000 మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగిలిన రూ.52,000కు ఎలాంటి సరైన లెక్కలు చూపకుండా కోత విధించారని ఆమె ఆరోపిస్తోంది.

ఈ అన్యాయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇంటి యజమానుల తీరును వివరిస్తూ, తనలా మరెవరూ మోసపోకూడదని పేర్కొంది. ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. ఇప్పటివరకు 7.3 లక్షల మందికి పైగా వీక్షించగా, వేల సంఖ్యలో నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బెంగళూరు సిటీ పోలీస్, ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

బెంగళూరులో అద్దెకు ఉంటున్న వారికి ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. పెయింటింగ్, డీప్ క్లీనింగ్, పాత మరమ్మతుల పేరుతో యజమానులు డిపాజిట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు కట్ చేయడం సర్వసాధారణంగా మారింది. కర్ణాటక రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం డిపాజిట్‌పై పరిమితులు ఉన్నప్పటికీ, వాటి అమలు సరిగా లేకపోవడంతో యజమానుల ఇష్టారాజ్యంగా నడుస్తోందని పలువురు వాపోతున్నారు. ఈ ఘటనతో అద్దెదారుల హక్కులు, యజమానుల బాధ్యతలపై సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే పక్కా రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడంతో పాటు, ఇంట్లోకి మారేటప్పుడు, ఖాళీ చేసేటప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Go Back to Shorts
Bangalore House Owners
Bengaluru
House Owners
Rental Agreement
Karnataka Rent Control Act
Rental Deposit
Apartment Rent
Tenants Rights
Rent Agreement
Property Dispute

More Telugu News