LPG Gas Booking Scam: గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త మోసం.. వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్త!

LPG Gas Booking Scam Alert Issued by Central Government
షార్ట్స్‌లో చూడండి
ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైల్స్‌ను వాట్సాప్ ద్వారా పంపి వినియోగదారులను మోసం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇలాంటి అనుమానాస్పద ఫైల్స్‌ను, అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని అధికారులు తెలిపారు. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్స్ కోసం కేవలం అధికారిక ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. గ్యాస్ కొరతపై వదంతులు నమ్మవద్దని, ఆందోళనతో సిలిండర్లు బుక్ చేసుకోవద్దని కోరింది. గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకునేలా విరామాన్ని సవరించారు.

గ్యాస్‌పై ఒత్తిడి తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, కొత్త పీఎన్ జీ కనెక్షన్లను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించింది. మొత్తం మీద గ్యాస్ సరఫరాకు ఢోకా లేదని భరోసా ఇస్తూనే, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.
Go Back to Shorts
LPG Gas Booking Scam
Gas Bill Update APK
Cyber Fraud
WhatsApp Scam
Gas Cylinder Booking
LPG Supply
Gas Shortage Rumors
PNG Connection
Kerosene
Alternative Fuels

More Telugu News