బలపడిన డాలర్... భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

బలపడిన డాలర్... భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

Federal Reserve Impact Gold Silver Prices Drop Sharply
  • ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంతో కుప్పకూలిన బులియన్ మార్కెట్
  • డాలర్ కు కలిసొచ్చిన ఫెడ్ నిర్ణయం
  • ఒక్కరోజే 8 శాతం పతనమైన వెండి ధర
  • 10 గ్రాముల బంగారంపై రూ.6 వేలకు పైగా క్షీణత
  • హైదరాబాద్‌లో రూ.1.52 లక్షలకు దిగొచ్చిన తులం బంగారం ధర
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) తీసుకున్న కీలక నిర్ణయం బులియన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ఫెడ్ ప్రకటించడంతో డాలర్ విలువ బలపడింది. దీనికి తోడు ట్రెజరీ బాండ్ల రాబడులు కూడా పెరగడంతో, పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత సాధనాల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. సాధారణంగా భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో పెరిగే ఈ లోహాలు, అందుకు భిన్నంగా యూటర్న్ తీసుకోవడం గమనార్హం.

దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్ కాంట్రాక్ట్‌లో కిలో వెండి ధర కేవలం ఒక్క రోజులోనే 8 శాతం పతనమైంది. అంటే ఏకంగా రూ.19,000 నష్టపోయి రూ.2.29 లక్షలకు చేరింది. బంగారం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 10 గ్రాముల బంగారం (ఏప్రిల్ డెలివరీ) ధర సుమారు 4 శాతం క్షీణించింది. దాదాపు రూ.6,000 తగ్గి రూ.1.46 లక్షల వద్ద ట్రేడ్ అయింది. 

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం సాయంత్రం నాటికి 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర రూ.1.52 లక్షలుగా, కిలో వెండి ధర రూ.2.36 లక్షలుగా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ఔన్సు ధర గతంలో 5,000 డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం 4,682 డాలర్లకు దిగివచ్చింది. స్పాట్ వెండి ఔన్సు ధర 70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు బంగారం, వెండి వంటి వడ్డీరహిత ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్ తీసుకున్న ఈ నిర్ణయం బంగారం, వెండిపై మరింత ఒత్తిడి పెంచిందని వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా, ఈ ధరల తగ్గుదలను కొనుగోలుకు అవకాశంగా చూడాలా లేక మరింత పతనం కోసం వేచిచూడాలా అనే సందిగ్ధంలో పెట్టుబడిదారులు ఉన్నారు. రాబోయే రోజుల్లో బులియన్ మార్కెట్ గమనం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Advertisement
Federal Reserve
Gold price
Silver price
MCX
Commodity market
Interest rates
Dollar value
Hyderabad bullion market
Spot gold
Spot silver

More Telugu News