Nara Lokesh: జోరువానలో పేద ముస్లిం ఇంటికి మంత్రి లోకేశ్‌... అక్కడే ఇఫ్తార్ విందు

Nara Lokesh Attends Iftar Dinner at Poor Muslim Home Amidst Heavy Rain
షార్ట్స్‌లో చూడండి
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి పట్టణం, పోలకంపాడులో నివసిస్తున్న షేక్ అమీర్ అనే పేద ముస్లిం యువకుడి ఇంటికి ఆకస్మికంగా వెళ్లారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన పర్యటనను ఆపలేదు. అమీర్ కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

విజయవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న షేక్ అమీర్ ఇంటికి మంత్రి లోకేశ్ చేరుకోగానే, ఆయన కుటుంబసభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ ధరించిన లోకేశ్‌, కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం అందరితో కలిసి కూర్చుని ఇఫ్తార్ విందు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... "ప్రజలకు మేలు చేసేందుకే దేవుడు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించాడు. నేను ప్రతి ఏటా బాధ్యతగా ఒక ముస్లిం సోదరుడి నివాసానికి వెళ్లి ఇఫ్తార్‌లో పాల్గొంటాను. మంగళగిరి ప్రజలు 53 వేల మెజారిటీ అడిగితే 91 వేల మెజారిటీ ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం" అని అన్నారు. ఇప్పటికే 3,000 ఇళ్ల పట్టాలు అందించామని, త్వరలోనే మరో 2,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామని తెలిపారు.

అమీర్ తండ్రి, లారీ డ్రైవర్ అయిన షేక్ అన్వర్ తమ కుటుంబ పరిస్థితులను మంత్రికి వివరించారు. తాము నివసిస్తున్న ఇల్లు ఇరుకుగా ఉందని, వర్షం వస్తే కారుతోందని, పాత రేకుల ఇంటి స్థానంలో కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేశ్‌, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, కొత్త ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పవిత్ర మాసంలో తమ ఇంటికి మంత్రి రావడంతో పాటు సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో అమీర్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం మంత్రి వారికి రంజాన్ బహుమతిని అందజేసి తిరుగుపయనమయ్యారు.

Go Back to Shorts
Nara Lokesh
Lokesh Nara
Mangalagiri
Iftar Party
Muslim Community
Andhra Pradesh Politics
TDP
Chandrababu Naidu
Ramzan
Sheikh Ameer

More Telugu News