Pilot Rohith Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. కాల్పుల కలకలం!

Pilot Rohith Reddy Farmhouse Drug Party Shooting Incident
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ప్రాంతం శనివారం రాత్రి కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన బీఎమ్‌ఆర్‌ ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మీడియాకు వివరించారు.

ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో శనివారం రాత్రి 9:30 గంటలకు ఈగల్ టీమ్, ఎస్‌‌వోటీ, స్థానిక పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు భయాందోళనతో గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీ రితేష్ రెడ్డికి చెందినదిగా ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, రమేశ్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి, ఒక మహిళ ఉన్నారు. వీరంతా వీకెండ్ పార్టీ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం.

పోలీసులు ఘటనా స్థలంలోనే డ్రగ్ టెస్ట్ కిట్‌లతో పరీక్షలు నిర్వహించగా.. రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్‌గా తేలింది. తామంతా వారం క్రితమే సిమ్లా, గోవా పర్యటనల నుంచి వచ్చామని, అక్కడే డ్రగ్స్ తీసుకున్నామని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. అయితే పూర్తిస్థాయి నిర్ధారణ కోసం వీరి రక్త నమూనాలను సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) ల్యాబ్‌కు పంపినట్లు డీసీపీ తెలిపారు. సోదాల సమయంలో పోలీసులు సుమారు 2 గ్రాముల తెల్లటి పౌడర్‌ను (కోకైన్‌గా అనుమానం) స్వాధీనం చేసుకున్నారు. ఇది డ్రగ్సా కాదా అన్నది పరీక్షల తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.  
Pilot Rohith Reddy
Rohith Reddy
BRS MLA
Drugs party
Ranga Reddy district
Putta Mahesh Kumar Yadav
Telangana news
Moinabad
Farmhouse raid
Drug test

More Telugu News