ప్రీ-లాంచ్ మోసం: భారతి బిల్డర్స్‌పై రెరా కొరడా.. డబ్బు వాపసు చేయాలని ఆదేశం

Bharati Builders Fined by RERA for Pre launch Fraud
  • భారతి బిల్డర్స్‌పై రూ. 4.74 కోట్ల జరిమానా విధించిన తెలంగాణ రెరా
  • సంస్థను 'డిఫాల్టర్ ప్రమోటర్'‌గా ప్రకటించిన అథారిటీ
  • ప్రీ-లాంచ్ స్కీమ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిధుల సేకరణ
  • కొనుగోలుదారులకు 60 రోజుల్లో వడ్డీతో సహా డబ్బు వాపసు చేయాలని ఆదేశం
  • రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టవద్దని ప్రజలకు హెచ్చరిక
నిబంధనలను ఉల్లంఘించి ప్రీ-లాంచ్ స్కీమ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన భారతి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) కఠిన చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు మొత్తం రూ. 4.74 కోట్ల భారీ జరిమానా విధించడంతో పాటు, దానిని 'డిఫాల్టర్ ప్రమోటర్‌'గా ప్రకటించింది. బాధితులకు 60 రోజుల్లో వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని 'భారతీ లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్' ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అథారిటీ, బిల్డర్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. 2021లో ప్రీ-లాంచ్ ఆఫర్ల ద్వారా కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన భారతి బిల్డర్స్, 24 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, రెరా రిజిస్ట్రేషన్ గానీ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు గానీ లేకుండానే నిధులు సేకరించి, ఇంతవరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రాజెక్టు పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో, కొనుగోలుదారులు అందులో కొనసాగాల్సిన అవసరం లేదని అథారిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, బాధితులు చెల్లించిన పూర్తి మొత్తాన్ని వడ్డీతో కలిపి 60 రోజుల్లోగా వాపసు చేయాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయిన 'శ్రీ భారతి' అనే మరో సంస్థను కూడా ప్రమోటర్‌గా పరిగణిస్తూ, రెండు సంస్థలూ ఉమ్మడిగా ఈ బాధ్యత వహించాలని తీర్పునిచ్చింది.

నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను భారతి బిల్డర్స్‌పై కొత్తగా రూ. 3.55 కోట్లు జరిమానా విధించింది. గతంలో ఇదే తరహా ఉల్లంఘనలకు విధించిన రూ. 1.18 కోట్ల జరిమానాకు ఇది అదనమని రెరా పేర్కొంది. 

ఈ సందర్భంగా రెరా ప్రజలకు కీలక సూచనలు చేసింది. రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులలో 'ప్రీ-లాంచ్' ఆఫర్లు చట్టవిరుద్ధమని, అలాంటి పథకాలలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులపై రెరా పర్యవేక్షణ ఉండదని, ఎస్క్రో ఖాతా వంటి ఆర్థిక భద్రతలు కొనుగోలుదారులకు లభించవని స్పష్టం చేసింది. ఏదైనా ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు, దాని రెరా రిజిస్ట్రేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ (rera.telangana.gov.in)లో ధ్రువీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Go Back to Shorts
Bharati Builders
TG RERA
Telangana RERA
Real Estate Regulatory Authority
Pre-launch scheme
Property fraud
Kompally
Bharati Lake View Apartments
Real estate investment

More Telugu News