Ongole: ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. జిల్లా ఎస్పీ ప్రశంసలు

Ongole Auto Driver Returns 30 Lakh Gold Praised by SP
  • విజయవాడ వాసి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు
  • డ్రైవర్ నాగేశ్వరరావు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగ్ అందజేత
  • నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్లను సత్కరించిన జిల్లా ఎస్పీ
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. ప్రయాణికులు ఆటోలో మర్చిపోయిన సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటనతో ఆటో డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సుబ్బారావు తన కుటుంబంతో కలిసి ఒంగోలు వచ్చారు. ఈ క్రమంలో ఓ ఆటో ఎక్కి గమ్యస్థానంలో దిగారు. అయితే, హడావిడిలో రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. కాసేపటికి విషయం గుర్తించిన సుబ్బారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ప్రయాణికులు దిగి వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు తన వాహనంలో బ్యాగును గమనించారు. అది తన ఆటోలో ప్రయాణించిన వారిదేనని భావించి, వారి కోసం సమీప ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో నేరుగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగును పోలీసులకు అప్పగించారు.

పోలీసులు బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సుబ్బారావుకు సమాచారం ఇచ్చి, నగలను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు నిజాయితీని మెచ్చి సత్కరించారు. ఇదే తరహాలో మరో ఘటనలో ప్రయాణికులు మర్చిపోయిన బంగారాన్ని అప్పగించిన ఆటో డ్రైవర్ ఖలీల్‌ను కూడా ఎస్పీ అభినందించారు.
Ongole
auto driver
gold jewelry
Prakasam district
Nageswara Rao
honest auto driver
police appreciation
Rs 30 lakh gold
Vijayawada
Subbarao

More Telugu News