Arun Dhumal: ఐపీఎల్‌పై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?

Arun Dhumal Addresses IPL 2026 Concerns Over Gas Shortage Flight Issues
  • ఐపీఎల్ 2026 సీజన్‌కు పొంచి ఉన్న సవాళ్లు
  • దేశంలో గ్యాస్ కొరతతో హోటళ్లకు ఇబ్బందులు
  • విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలపై నెలకొన్న అనిశ్చితి
  • పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్
  • ఈ నెల‌ 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ, టోర్నీ నిర్వహణకు కొత్త సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కొరత, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఏర్పడుతున్న ఆటంకాలు టోర్నీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ అంశాలపై తాము దృష్టి సారించామని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకే వంటగ్యాస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కారణంగా ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్రమైన గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ఐపీఎల్ జట్ల ఆతిథ్య ఏర్పాట్లపై ప్రభావం చూపవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థతో ఇవాళ‌ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. "ఇది కచ్చితంగా ఒక సవాలే. కానీ, హోటళ్ల నుంచి మాకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ సమస్య ఉందని వారు చెబితే, దాని ప్రకారం సమీక్షిస్తాం. ప్రస్తుతం మీడియా ద్వారానే ఈ విషయం మా దృష్టికి వచ్చింది. మేం పరిస్థితిని గమనిస్తున్నాం. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం" అని అన్నారు.

మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాల సమస్య కూడా ఐపీఎల్‌ను కలవరపెడుతోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో కొన్ని జట్లు స్వదేశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. మధ్యప్రాచ్యం మీదుగా విమాన మార్గాలు ప్రభావితం కావడంతో జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆలస్యంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఐపీఎల్ కోసం విదేశీ ఆటగాళ్లు, కోచ్‌లు, బ్రాడ్‌కాస్టర్లు ఎక్కువగా దుబాయ్ మీదుగా భారత్‌కు వస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి ప్రయాణాలపై కూడా అనిశ్చితి నెలకొంది.

"ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా కొన్ని వారాల సమయం ఉంది. దీన్ని ఎలా అధిగమించాలో చూస్తాం" అని ధుమాల్ తెలిపారు. ఈ నెల‌ 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ జరగనుండగా, ఎల్లుండి తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Arun Dhumal
IPL 2026
Indian Premier League
LPG shortage
Gas shortage India
Flight disruptions
T20 World Cup
Cricket
BCCI
Sports

More Telugu News