Balendra Shah: 4సార్లు ప్రధానిగా చేసిన ఓలీని భారీ మెజార్టీతో ఓడించిన ర్యాపర్ బాలేంద్ర షా

Balendra Shah Defeats KP Oli in Nepal Election
  • ఝాపా-5 నియోజకవర్గం నుంచి 50 వేలకు పైచిలుకు ఓట్లతో ఓలి ఓటమి
  • బాలేంద్ర షా 68,348 ఓట్లు సాధించగా, ఓలీకి కేవలం 18,734 ఓట్లు
  • 2022లో ఖాట్మాండ్ మేయర్‌గా పని చేసిన బాలేంద్ర షా
నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా (35) నాలుగుసార్లు ప్రధానిగా చేసిన కేపీ ఓలీని ఓడించారు. ఝాపా-5 నియోజకవర్గంలో ఓలీని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేసిన బాలేంద్ర షా 50 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. బాలేంద్ర షా 68,348 ఓట్లు సాధించగా, ఓలీకి కేవలం 18,734 ఓట్లు వచ్చాయి. నేపాల్‌లో గురువారం ఎన్నికలు జరగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు మొదలైంది.

బాలేంద్ర షా 2022లో ఖాట్మాండ్ మేయర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. బాలేంద్ర షాను బాలెన్‌గా పిలుస్తుంటారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఆయన ర్యాప్ గాయకుడు కూడా కావడం గమనార్హం. ఆయన యూట్యూబ్ ఛానల్‌కు పది లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

2025లో కేపీ ఓలీ సోషల్ మీడియాపై నిషేధం విధించినప్పుడు జెన్ జెడ్ పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఇందులో బాలేంద్ర షా కీలక పాత్ర పోషించారు. 2023లో టైమ్ మ్యాగజైన్ 'ప్రపంచంలో ఎదుగుతున్న అత్యంత ప్రభావశీలురు' 100 మంది జాబితాలో బాలేంద్ర షా ఉన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం కూలినప్పుడు తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని తన ముందుకు ప్రతిపాదన రాగా బాలేంద్ర షా తిరస్కరించారు.

ఇప్పుడు నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఆర్ఎస్పీ 25 సీట్లలో గెలిచి 93 సీట్లలో ఆధిక్యంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్ 4 సీట్లలో గెలిచి 11 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు 40 సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
Balendra Shah
KP Oli
Nepal election
Rapper politician
Rastriya Swatantra Party
Nepal politics

More Telugu News