Nellore: నెల్లూరు జిల్లాలో వింత ఘటన.. పాముతో ఆసుప‌త్రికి వచ్చిన యువకుడు!

Nellore Man Bitten by Snake Brings it to Hospital
  • నెల్లూరు జిల్లా కోవూరులో ఘటన
  • హోటల్‌లో భోజనం చేస్తుండగా యువకుడికి పాముకాటు
  • కరిచిన పామును చంపి ఆసుప‌త్రికి తీసుకెళ్లిన బాధితుడు
  • వైద్యులకు చూపించేందుకే అలా చేశానని వెల్లడి
నెల్లూరు జిల్లా కోవూరులో ఓ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాముకాటుకు గురైన ఓ యువకుడు, కరిచిన పామును చంపి చేత్తో పట్టుకుని ఆసుప‌త్రికి రావడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
నెల్లూరు శివారులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన వలీ అనే యువకుడు నిన్న‌ మధ్యాహ్నం భోజనం కోసం కోవూరులోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అతను భోజనం చేస్తున్న సమయంలో ఓ రక్తపింజరి పాము కాటు వేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వలీ, ఆ పామును చంపేశాడు. అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంపిన పామును తీసుకుని నేరుగా కోవూరు ప్రభుత్వ ఆసుప‌త్రికి (సీహెచ్‌సీ) వెళ్లాడు.

పాముతో సహా ఆసుప‌త్రిలోకి వచ్చిన యువకుడిని చూసి అక్కడి సిబ్బంది, రోగులు భయపడ్డారు. వెంటనే తేరుకున్న వైద్య సిబ్బంది, అతడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. తనను ఏ పాము కరిచిందో వైద్యులకు స్పష్టంగా చూపిస్తే, సరైన చికిత్స అందిస్తారనే ఉద్దేశంతోనే ఆ పామును వెంట తెచ్చినట్లు వ‌లీ ఆసుప‌త్రి సిబ్బందికి తెలిపాడు. యువకుడు పామును తీసుకుని ఆసుపత్రికి వెళుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
Nellore
Snake bite
Kovuru
Government Hospital
Viral video
Bhagat Singh Colony
Poisonous snake
Treatment

More Telugu News