Chandrababu Naidu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కీలక ఒప్పందాలు!

Chandrababu Naidu to Attend AI Impact Summit in Delhi Key Agreements Expected
  • ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
  • ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • ఐబీఎం, ఐఐటీ మద్రాస్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థలతో కీలక ఒప్పందాలు
  • 10 లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటం టెక్నాలజీలో నైపుణ్య శిక్షణ
  • కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కీలక పర్యటన చేపట్టనున్నారు. రేపు (ఫిబ్రవరి 20) ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి, యువతకు నైపుణ్య శిక్షణకు మార్గం సుగమం చేసేలా పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో కీలక ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోనున్నారు.

ఈ సదస్సులో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు చరిత్రాత్మక ఒప్పందాలకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్ సాంకేతికతల్లో నైపుణ్యాలు కల్పించేందుకు దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే, ఏఐ, క్వాంటం టెక్నాలజీలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు యూనిసీసీ సంస్థతో కలిసి 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీ సంస్థతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ కోసం ఐఐటీ మద్రాస్‌తోనూ ప్రభుత్వం ఎంఓయూలు చేసుకోనుంది. ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై కూడా ఈ సదస్సులో కీలక ప్రకటన చేయనున్నారు.

రేపు ఉదయం 9:30 గంటలకు జరిగే ప్లీనరీ సెషన్‌లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, డబ్ల్యూఈఎఫ్ సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి కృత్రిమ మేధస్సు అంశంపై చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్ ప్రతినిధి బృందంతో పాటు అరామ్కో, అడోబ్, ఆటోడెస్క్ వంటి కంపెనీల అధిపతులతోనూ ముఖ్యమంత్రి విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చలు జరుపుతారు.

ఈ సాయంత్రం జైపూర్ కు!

కాగా, ఢిల్లీ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం జైపూర్ వెళ్లనున్నారు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహ వేడుకకు హాజరై, రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం జైపూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకొని ఏఐ సదస్సులో పాల్గొంటారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Artificial Intelligence
AI Impact Summit 2026
IBM
NVIDIA
World Economic Forum
Skills Training
Quantum Technology
Cyber Security

More Telugu News