Stock Market: మార్కెట్లను ముంచిన టెక్ షేర్లు... కిందకు జారిన సూచీలు

Stock Market Today Tech Shares Drag Indices Lower
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది. కొన్ని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు కనిపించినా, టెక్నాలజీ రంగంలో బలహీన సెంటిమెంట్‌ను అధిగమించలేకపోయాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 558.72 పాయింట్లు నష్టపోయి 83,674.92 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 146.65 పాయింట్లు క్షీణించి 25,807.2 వద్ద ముగిసింది.

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5.51 శాతం కుప్పకూలింది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురై టాప్ లూజర్లుగా నిలిచాయి. ఆటో దిగ్గజం మహీంద్రా & మహీంద్రా కూడా నష్టాల్లోనే ముగిసింది. మరోవైపు, మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL), ట్రెంట్ వంటివి లాభపడి సూచీలకు కొంత మద్దతు ఇచ్చాయి.

విశ్లేషకుల ప్రకారం, నిఫ్టీ 25,840–25,900 స్థాయిని దాటనింత వరకు స్వల్పకాలికంగా మార్కెట్ బలహీనంగానే కొనసాగవచ్చు. ఒకవేళ సూచీ మరింత పతనమైతే 25,750 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీతో పాటు రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు కూడా ఒత్తిడికి గురయ్యాయి. బ్రాడర్ మార్కెట్లలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాలతోనే ముగిశాయి.
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty
Share Market
Indian Stock Market
Tech Stocks
Market News
BSE
NSE
Trading

More Telugu News