ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు... రేపు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- కాకినాడలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం
- రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏఎమ్ గ్రీన్ సంస్థ ఏర్పాటు
- ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,600 మందికి ఉపాధి అవకాశాలు
- హరిత ఇంధన రంగంలో దేశంలోనే కీలక ముందడుగు
ప్లాంట్ విశేషాలు.. వేల ఉద్యోగాలు
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత టెక్నాలజీతో పనిచేసే ఈ ప్లాంట్ ద్వారా ఏటా 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో, గతంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉన్న ప్రదేశంలో ఈ కొత్త ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
2027 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి, 11:20 గంటలకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, అనంతరం ప్రసంగిస్తారు.
పర్యావరణ హితం.. ప్రపంచానికి ఎగుమతులు
బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలతో తయారు చేసే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా, ఈ గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగా తయారయ్యే ఈ ఇంధనం పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించదు. ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత తరుణంలో, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాకినాడ పోర్టుకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ప్లాంట్ ఉండటం వల్ల, ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియాను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏఎమ్ గ్రీన్ సంస్థ జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్ఈతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టుతో పాటే, కాకినాడలోనే సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను కూడా ఏఎమ్ గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్ జీఐసీ, యూఏఈకి చెందిన ఏడీఏఐ వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ హరిత ఇంధన పటంలో కీలక స్థానంలో నిలపనుంది.