ఇది తాత్కాలిక నిర్ణయం మాత్రమే... పైలట్ల నిబంధనలపై వెనక్కి తగ్గలేదు: కేంద్రం
- పైలట్ల కొత్త FDTL నిబంధనలు కొనసాగుతాయన్న కేంద్రం
- ఇండిగో ఏ320 విమానాలకు మాత్రమే తాత్కాలిక వెసులుబాటు
- విమానాల షెడ్యూల్స్ సరిచేసేందుకే ఈ నిర్ణయం అని వివరణ
- 2026 ఫిబ్రవరి 10 వరకు సడలింపులు వర్తింపు అని వెల్లడి
శుక్రవారం మంత్రిత్వ శాఖ చేసిన ఓ ప్రకటనలో FDTL ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు పేర్కొనడంతో కొంత అపోహ నెలకొంది. అయితే, ఆ ప్రకటన వెలువడటానికి గంట ముందే డీజీసీఏ కేవలం ఇండిగో ఏ320 ఫ్లీట్‌కు మాత్రమే 2026 ఫిబ్రవరి 10 వరకు మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు వివరించారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త రూల్స్ కారణంగా విమానాలు భారీగా ఆలస్యం కావడం, రద్దు కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ సడలింపులలో భాగంగా.. రాత్రి డ్యూటీ సమయాన్ని పాత పద్ధతి ప్రకారమే (రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు) పరిగణించడం, రాత్రి డ్యూటీలో ల్యాండింగ్‌ల సంఖ్యపై పరిమితిని మార్చడం వంటివి ఉన్నాయి.
అయితే, పైలట్ల డ్యూటీ గంటలు, విశ్రాంతి అవసరాలు, వారానికి తప్పనిసరిగా 48 గంటల విశ్రాంతి వంటి కీలకమైన భద్రతా నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు నొక్కిచెప్పారు. ఈ సడలింపులు ఇండిగోలోని ఇతర విమానాలకు గానీ, వేరే ఏ ఇతర ఎయిర్‌లైన్స్‌కు గానీ వర్తించవని స్పష్టం చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించి, విమాన కార్యకలాపాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడమే ఈ తాత్కాలిక చర్యల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.