Mukesh Ambani: ఏపీలో భారీ పెట్టుబడులకు రిలయెన్స్ గ్రీన్ సిగ్నల్... సీఎం చంద్రబాబుతో భేటీలో కీలక నిర్ణయం

 Reliance Announces Investments After Meeting CM Chandra Babu
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయెన్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావు ముఖ్యమంత్రితో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా 1 గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన GPUలు, TPUలు, AI ప్రాసెసర్‌లతో కూడిన ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయెన్స్ ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏపీలో ఈ సెంటర్ పనిచేస్తుంది. ఈ రెండు కేంద్రాలతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ నెట్‌వర్క్‌లలో ఒకటిగా రిలయెన్స్ అవతరించనుంది.

ఈ ఏఐ డేటా సెంటర్ విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా 6 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును కూడా రిలయెన్స్ నిర్మించనుంది. దీంతో పాటు కర్నూలులో 170 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యాలతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

రాష్ట్రంపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Mukesh Ambani
Reliance Industries
Andhra Pradesh
Chandra Babu Naidu
Artificial Intelligence
AI Data Center
Solar Power Plant
Greenfield Food Park
Visakhapatnam
Investments

More Telugu News