Harshita: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య

Newly Wed Bride Commits Suicide in Sri Sathya Sai District
  • శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఘటన
  • నిన్న ఉదయం హర్షిత, నాగేంద్రల వివాహం
  • రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హర్షిత
  • రెండు కుటుంబాల్లో విషాదం నింపిన నవవధువు
శ్రీ సత్యసాయి జిల్లాలో కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి పరిధిలోని దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో నిన్న ఉదయం వైభవంగా వివాహం జరిగింది.

నూతన దంపతులకు సోమందేపల్లిలో కుటుంబ సభ్యులు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుండగా, హర్షిత తన గదిలోకి వెళ్లి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ నవవధువు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె ఉరివేసుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది.

వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రమేశ్ బాబు తెలిపారు. 
Harshita
Sri Sathya Sai district
Somandepalli
bride suicide
Andhra Pradesh news
marriage
Narendra
আত্মহত্যা
crime news

More Telugu News