'హరిహర వీరమల్లు' విడుదల తేదీపై స్పందించిన నిర్మాణ సంస్థ
- పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' పార్ట్ 1 విడుదల వాయిదా
- సినిమా కొత్త విడుదల తేదీపై సోషల్ మీడియాలో ఊహాగానాలు
- ఈ వదంతులను నమ్మవద్దని స్పష్టం చేసిన నిర్మాణ సంస్థ
- త్వరలోనే అధికారికంగా కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడి
సినిమా విడుదల తేదీ గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఎక్స్' ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ గురించి ఆన్‌లైన్‌లో వస్తున్న వార్తలను విశ్వసించవద్దు. త్వరలోనే మా అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా కొత్త తేదీని ప్రకటిస్తాం. అప్పటివరకు మీ ఆదరణ, ప్రోత్సాహం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం’’ అని మెగా సూర్య ప్రొడక్షన్స్ తమ ప్రకటనలో పేర్కొంది.
తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆయన కొంత భాగం చిత్రీకరించిన తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. సినిమా నిర్మాణం ఆలస్యం కావడం, నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థిక భారం పడటంతో పవన్ కల్యాణ్ తాను ముందుగా తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.