ఉన్నత ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ఏబీసీడీ అవార్డులు అందజేసిన ఏపీ డీజీపీ

AP DGP Presents ABCD Awards to Top Police Officers
  • పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి ప్రధమ బహుమతి
  • విజయనగరం, గుంటూరు ఎస్పీలకు ద్వితీయ, తృతీయ బహుమతులు
  • డీజీపీ కార్యాలయంలో నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందజేసిన హరీష్ కుమార్ గుప్తా 
నేర పరిశోధన రంగంలో కేసుల సత్వర పరిష్కారానికి ఆధునిక విధానాలను అనుసరించి, వినూత్న మార్గాలను అన్వేషిస్తూ 'ఏబీసీడీ (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్)'కు ఎంపికైన పోలీసు అధికారులను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించి సత్కరించారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్-డిసెంబర్ 2024 నాల్గవ త్రైమాసికానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచి కేసుల పూర్వాపరాలను, వాటి పరిష్కారంలో వినియోగించిన సాంకేతిక పద్ధతులను, వినూత్న విధానాలను సి.ఐ.డి డీజీపీ శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ పూర్తిగా పరిశీలించి నాలుగు ఉత్తమ కేసులను ఎంపిక చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్వంలోని బృందం ఆకివీడు మండల పరిధిలో జరిగిన హత్య కేసును చాకచక్యంగా ఛేదించినందుకు ఉత్తమ బహుమతిని అందుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీమతి రత్న నేతృత్వంలోని బృందం గుడిబండ పరిధిలో ఒక వ్యక్తి తన శిశువును హత్య చేసి తప్పించుకుని కర్ణాటక రాష్ట్రంలో నకిలీ పేరుతో తిరుగుతుండగా పట్టుకున్నారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న 26 సంవత్సరాల నాటి కేసును ఛేదించినందుకు గాను ద్వితీయ బహుమతిని అందజేశారు.

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలోని బృందం విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ (డిజిటల్ అరెస్ట్) కేసును ఛేదించి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు, రూ.9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేయడంతో పాటు, ఫిర్యాదుపై సకాలంలో స్పందించి నిందితుల బ్యాంకు ఖాతాల్లోని మరో రూ.22 లక్షలను ఫ్రీజ్ చేసి, డిజిటల్ అరెస్ట్ కేసును చాకచక్యంగా ఛేదించినందుకు తృతీయ బహుమతిని అందుకుంది.

గుంటూరు జిల్లా ఎస్పీ యస్. సతీష్ కుమార్ నేతృత్వంలోని బృందం చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక హత్య కేసును చాకచక్యంగా ఛేదించినందుకు కన్సోలేషన్ బహుమతిని అందుకుంది.

ఏబీసీడీ అవార్డుల ప్రదానంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానం పొందిన కేసుకు లక్ష రూపాయల నగదు బహుమతి, రెండవ స్థానం పొందిన కేసుకు రూ.60 వేలు, మూడవ స్థానం పొందిన కేసుకు రూ.40 వేలు మరియు కన్సోలేషన్ బహుమతి పొందిన కేసుకు రూ.20 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ సిబ్బంది అందరూ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. 
Go Back to Shorts
Harish Kumar Gupta
AP DGP
ABCD Awards
Andhra Pradesh Police
Crime Detection
Best Police Officers
Award Ceremony
Cyber Crime
Case Solving
Police Awards

More Telugu News