ఆ రోజు నేనేంటో మీకు తెలీదు... మీ సమస్యలేంటో నాకు అర్థం కాలేదు!: నారా లోకేశ్
- నేడు మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ
- పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషం కలిగిస్తోందని వెల్లడి
- 2019లో తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని మార్చేసిందని స్పష్టీకరణ
అదే నాకు టర్నింగ్ పాయింట్
2019లో నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. 2019లో మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. ఆనాడు నేనేంటో మీకు తెలియదు. మీ సమస్యలేంటో నాకు అర్థంకాలేదు. ఫలితంగా 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. దీంతో కసిగా పనిచేసి మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవాలని భావించా.
ఎన్టీఆర్ సంజీవని పేరుతో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించాను. మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు అందజేయడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తున్నాం. మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటుచేసి క్రీడలను ప్రోత్సహించాం. ఈ విధంగా మంగళగిరిలో 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.
మంగళగిరి ప్రజలు నా గౌరవం నిలబెట్టారు
2019 నుంచి 2024 వరకు నన్ను అనేక రకాలుగా అవమానించారు. మంగళగిరిలో గెలవలేదని హేళన చేశారు. సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారని చంద్రబాబు గారిని అన్నారు.
ఆ సమయంలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను... దానిపక్కన సున్నా పెట్టి 53,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆనాడు మంగళగిరి ప్రజలను కోరాను. అందరికీ దిమ్మతిరిగి విధంగా 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారు. ఈ రోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేస్తున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన మెజార్టీ... అని ఉద్వేగభరితంగా చెప్పారు.