ఇలాంటి వేదికలు దొరుకుతాయని అప్పుడు అనుకోలేదు: కమల్ హాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలాంటి వేదికలు దొరుకుతాయని అప్పుడు అనుకోలేదు: కమల్ హాసన్

Kamal Haasan speech in Bharateetyudu2 pre release event
  • హైదరాబాదులో భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన కమల్ హాసన్
  • 52 ఏళ్ల క్రితం మొదటిసారి ఓ టెక్నీషియన్ గా హైదరాబాద్ వచ్చానని వెల్లడి
  • భారతీయుడు-2 సూపర్ హిట్ ఖాయం అని ధీమా వ్యక్తం చేసిన కమల్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భారతీయుడు-2. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. హీరో కమల్ హాసన్ హాజరై ప్రసంగించారు. 

"నేను మొదటగా తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్పాలి అని ఆలోచిస్తే... కృతజ్ఞతలు చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే, 52 ఏళ్ల క్రితం నేను మొదటిసారిగా ఓ టెక్నీషియన్ గా హైదరాబాద్ వచ్చాను. ఇలాంటి వేదికలు నాకు దొరుకుతాయని నేను అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు జులై 12న భారతీయుడు-2 చిత్రం వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను చేయి పట్టి నడిపించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మూడు తరాల వారు నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ ఇంత దూరం తీసుకువచ్చారు. 

28 ఏళ్ల కిందట భారతీయుడు వచ్చినప్పుడు నేను గానీ, శంకర్ గానీ అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. కానీ ఆ చిత్రం నమ్మశక్యం కాని రీతిలో సక్సెస్ సాధించింది. అప్పట్లో ఎంతో బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అది... కలెక్షన్లు వస్తాయా? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అందరి అనుమానాలను భారతీయుడు పటాపంచలు చేసింది. కె.బాలచందర్, కె.విశ్వనాథ్, శంకర్ వంటి దర్శకులు నాకు హిట్లు ఇచ్చారు. నన్ను ఇంతవాడ్ని చేశారు. 

భారతీయుడు-2 మనందరి సినిమా. భారతీయుడు సినిమాలో గుంపులో నిలబడే పాత్ర అయినా లభిస్తే చాలని సముద్రఖని గారు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడాయన భారతీయుడు-2లో నటించారు. ఇక నా దృష్టి అంతా ప్రతిభావంతులను ఇండస్ట్రీకి తీసుకురావడంపైనే ఉంటుంది. నేను గానీ, రజనీకాంత్ గానీ, నగేశ్ కానీ బాలచందర్ గారి వల్లే వెండితెరపై రాణిస్తున్నాం. 

ఇక, భారతీయుడు-2 చిత్రం గురించి అందరూ చెప్పారు... నేనేమీ చెప్పనక్కర్లేదు... ఆ సినిమాయే మాట్లాడుతుంది. శంకర్ గారు నాకో ఆదేశం ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్లినా భారతీయుడు-3 గురించే మాట్లాడుతున్నారు... దాని గురించి మాట్లాడొద్దు... భారతీయుడు-2 గురించే మాట్లాడండి అన్నారు. భారతీయుడు-3 గురించే మాట్లాడుతుంటే భారతీయుడు-2 బాగాలేదని అనుకుంటారు... అందుకే భారతీయుడు-2 గురించే మాట్లాడాలని ఉత్తర్వులు ఇచ్చారు. భారతీయుడు-2నే భారతీయుడు-3... భారతీయుడు-3నే భారతీయుడు-2. 

భారతీయుడు-2 సూపర్ హిట్ ఖాయం... భారతీయుడు-3 కోసం కూడా ఎదురుచూస్తుంటాం... అందులో నేనొక నటుడిని మాత్రమే కాదు, ఆ సినిమాకు నేనొక అభిమానిని కూడా" అని కమల్ హాసన్ వివరించారు.
Advertisement
Kamal Haasan
Bharateeyudu 2
Pre Release Event
Hyderabad

More Telugu News