love jihad: నా కూతురుది లవ్ జిహాద్ హత్యే.. కర్ణాటక కార్పొరేటర్ ఆరోపణ

  • కాలేజీలో మాజీ క్లాస్ మేట్ చేతిలో హత్యకు గురైన కార్పొరేటర్ కూతురు
  • సంఘటన జరిగిన మరుసటి రోజు సంచలన ఆరోపణలు
  • నిందితుడిని ఉరి తీయాలని లేదా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ 
Karnataka Congress corporator claims daughter killed due to love jihad

కర్ణాటకలోని కాలేజీ క్యాంపస్ లో కత్తిపోట్లకు గురై చనిపోయిన నేహ హిరేమత్ ది ముమ్మాటికీ లవ్ జిహాద్ హత్యేనని ఆమె తండ్రి, కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ పేర్కొన్నారు. గురువారం ఆయన కూతురు హత్యకు గురికాగా.. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రేమను నిరాకరించడంతో నేహపై ఫయాజ్ దాడి చేసి ఏడెనిమిది సార్లు కత్తితో పొడిచాడని చెప్పారు. ఇది లవ్ జిహాద్ కాకుంటే మరేంటని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో గొప్పింటి బిడ్డలను టార్గెట్ చేసి లవ్ జిహాద్ కు ప్రయత్నించడం, కాదంటే దాడులు చేయడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని నిరంజన్ ఆరోపించారు.

వాళ్లలో రోజురోజుకూ క్రూరత్వం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ కు చాలామంది తమ కూతుళ్లను పోగొట్టుకున్నారని, ఇప్పుడు ఆ ఘోరం తనకూ అనుభవంలోకి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నిందితుడు ఫయాజ్ తరఫున ఎవరూ బెయిల్ పిటిషన్ వేయొద్దంటూ కర్ణాటక బార్ అసోసియేషన్ కు, ఈ దారుణానికి పాల్పడిన ఫయాజ్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు, న్యాయస్థానానికి నిరంజన్ హిరేమత్ విజ్ఞప్తి చేశారు. ఈ దారుణంలో ఫయాజ్ తో పాటు మరో ముగ్గురి హస్తం ఉందని, మిగతా ముగ్గురిని కూడా అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. నిందితుడిని సాధ్యమైనంత త్వరగా ఎన్ కౌంటర్ చేయాలని లేదా ఉరితీయాలని నిరంజన్ కోరారు.

హుబ్బళ్లిలోని ఓ కాలేజీలో గురువారం విద్యార్థిని నేహ హిరేమత్ హత్యకు గురైంది. ఫయాజ్ ఆమెను కిరాతకంగా పొడిచి చంపేశాడు. క్యాంపస్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగుతోంది. హత్యకు గురైన యువతి కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు కావడం గమనార్హం. ఈ దారుణానికి కారణం లవ్ జిహాదేనని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా కాంగ్రెస్ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో మృతురాలి తండ్రి, కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ శుక్రవారం స్పందిస్తూ.. తన కూతురు మరణానికి కారణం లవ్ జిహాదేనని ఆరోపించారు.

More Telugu News