నేడు బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే.... ఇప్పటికే లీకులు వచ్చేశాయ్!

All set for Bigg Boss Season 7 Grand Finale
  • నేటితో ముగియనున్న తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్
  • ఫైనల్స్ కు చేరిన అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్
  • ప్రోమో విడుదల చేసిన స్టార్ మా చానల్
తెలుగు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారమవుతున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 నేటితో ముగియనుంది. ఇవాళ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో విజేత ఎవరన్నది అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక జైన్, అంబటి అర్జున్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. 

నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను 'స్టార్ మా' చానల్ రిలీజ్ చేసింది. బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ చిత్రబృందం కూడా నేటి ఎపిసోడ్ లో సందడి చేయడం ప్రోమోలో చూడొచ్చు. ఇంటి సభ్యులకు క్యాష్ ఆఫర్ చేసేందుకు సూట్ కేసుతో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టడం ప్రోమోలో కనిపించింది.

కాగా, ఎప్పట్లాగానే బిగ్ బాస్ షోకి సంబంధించి కొన్ని లీకులు ప్రచారంలో ఉన్నాయి. ఈసారి విన్నర్ పల్లవి ప్రశాంత్ అని సోషల్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల క్యాష్ తో ఉన్న సూట్ కేసు అందుకుని బయటికి వచ్చేశాడని కూడా ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. నేటి రాత్రి 7 గంటల నుంచి 'స్టార్ మా' చానల్లో బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. 

ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Bigg Boss Season 7
Grand Finale
Star Maa
Nagarjuna
Telangana
Andhra Pradesh

More Telugu News