ఇంజన్ ఫెయిల్ కావడంతో సముద్రంలో ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్
- దక్షిణ ఫ్రాన్స్ లోని ఫ్రెజుస్ తీరంలో ఘటన
- నీట మునిగిన విమానం
- ప్రయాణికులను కాపాడిన రెస్క్యూ టీమ్
- పైలట్ సమయస్పూర్తితో తప్పిన ప్రాణనష్టం
దక్షిణ ఫ్రాన్స్ లోని ఫ్రెజుస్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ తో పాటు ఇద్దరు ప్రయాణికులతో వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఇంజన్ ఫెయిల్ అయింది. దగ్గర్లో విమానాశ్రయం లేకపోవడంతో పక్కనే ఉన్న బీచ్ లో విమానాన్ని ల్యాండ్ చేయాలని పైలట్ భావించారు. అయితే, బీచ్ లో ఉన్న పర్యాటకుల కారణంగా ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి సముద్రంపై దించారు. విమానం నీళ్లలో ల్యాండ్ కావడం చూసి బీచ్ లోని రెస్క్యూ బృందం అప్రమత్తమైంది. వెంటనే బోట్లలో ప్రమాద స్థలానికి చేరుకుని ముగ్గురినీ రక్షించి, ఒడ్డుకు చేర్చింది. విమానం మాత్రం సముద్రంలో మునిగిపోయింది.