కేసీఆర్ సభకు నేను వెళ్లడం లేదు.. తేజస్వి వెళతారు: నితీశ్ కుమార్

Tejashwi Yadav going to KCR sabha
  • వచ్చే నెల 17న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
  • అదే రోజున హైదరాబాద్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
  • తన బదులు తేజస్వి, లలన్ వెళ్తారన్న నితీశ్ కుమార్
వచ్చే నెల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అదే రోజు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు కీలక నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కూడా కేసీఆర్ ఆహ్వానించారు. 

దీనిపై నితీశ్ కుమార్ స్పందిస్తూ... కేసీఆర్ నుంచి తనకు ఆహ్వానం అందిందని... అయితే తాను వెళ్లడం లేదని ఆయన చెప్పారు. తన బదులుగా డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ లు హైదరాబాద్ కు వెళ్తారని తెలిపారు.

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఎందుకు వెళ్లలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... అప్పుడు తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ పిలుపు వచ్చినా అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో వెళ్లలేకపోయేవాడినని నితీశ్ చెప్పారు. వచ్చే నెల జరగనున్న కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని... అయితే పని ఒత్తిడి కారణంగా రాలేనని చెప్పానని... దీంతో, తేజస్విని అయినా పంపమని కేసీఆర్ కోరారని తెలిపారు. తేజస్వికి తాను చెపుతానని, మీరు కూడా ఓ మాట చెప్పాలని కేసీఆర్ కు చెప్పానని అన్నారు. తేజస్వి, లలన్ ఇద్దరూ బీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. తమ నేతలు బీఆర్ఎస్ కార్యక్రమాలకు వెళ్లడం వల్ల... కాంగ్రెస్ తో తమకున్న బంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.
Go Back to Shorts
Nitish Kumar
Tejashwi Yadav
JDU
RJD
KCR
BRS

More Telugu News