Advertisement

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy issues key orders for crackdown on drugs in campuses
  • విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ ఆదేశం
  • క్యాంపస్‌లలో డ్రగ్స్ ఘటనలకు కాలేజీ యాజమాన్యాలదే బాధ్యత
  • డ్రగ్స్ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు, క్యూఆర్ కోడ్ల ఏర్పాటుకు సూచన
  • అవసరమైతే డ్రగ్స్ నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాలని యోచన
  • గుర్తించడం, చికిత్స, శిక్షించడం అనే మూడు దశల వ్యూహం అమలు
తెలంగాణలో మాదకద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, కళాశాలల ప్రాంగణాల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

కళాశాల ప్రాంగణాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా, సంబంధిత యాజమాన్యాలనే బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో యాజమాన్యాలకు అధికారాలు కల్పించడంతో పాటు, వారిని బాధ్యులను కూడా చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రతి కళాశాలలో ఒక ప్రత్యేక విభాగాన్ని (సెల్) ఏర్పాటు చేయాలని సూచించారు.

మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా, సులభంగా చేరవేసేందుకు విద్యాసంస్థల్లో టోల్-ఫ్రీ నంబర్లు, ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. క్యాంపస్ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచేలా పటిష్ట వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించడం, వారిని డీ-ఎడిక్షన్ కేంద్రాలకు పంపడం, తదనంతరం నేరస్తులను కఠినంగా శిక్షించడం అనే మూడంచెల వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

మాదకద్రవ్యాల కేసుల్లో పదేపదే నిందితులుగా మారుతున్న వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైతే మరిన్ని పటిష్టమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.                                
Advertisement
Revanth Reddy
Telangana drug crackdown
Campus drug control
Hyderabad college safety
Anti drug measures Telangana
Drug control laws

More Telugu News