హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు!
- ఈ ఏడాది 300, వచ్చే ఏడాది 310 బస్సులు
- వీటిలో 10 డబుల్ డెక్కర్ బస్సులు
- వంతెనలు, ఆటంకాలు లేని మార్గాల్లో తిప్పాలని నిర్ణయం
- ఇరవై ఏళ్ల క్రితమే నగరం నుంచి మాయమైన డబుల్ డెక్కర్ బస్సులు
ఈ ఏడాది 300, వచ్చే ఏడాది 310 మొత్తంగా 610 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటిని నడిపిస్తారు. ఈ బస్సుల్లో 10 డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్టీసీ గతంలోనే టెండర్లు ఆహ్వానించింది. తొలుత వీటిని అశోక్ లే ల్యాండ్ సంస్థ ద్వారా కొనాలని భావించింది.
అయితే, ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ. 2 కోట్లకు పైగానే ఉండడం, కేంద్రం ఇచ్చే రాయితీ రూ. 30 లక్షలకే పరిమితం కావడంతో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. అయితే, ఇప్పుడు వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆర్టీసీకి అందనున్న 310 బస్సులు అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంటున్నవే కావడం గమనార్హం.