నడిచైనా వెళతానేమో కానీ జన్మలో ఇండిగో విమానం మాత్రం ఎక్కను.... శపథం చేసిన కేరళ రాజకీయనేత
- సీఎం విజయన్ తో ఒకే విమానంలో ప్రయాణించిన జయరాజన్
- సీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు
- విమానంలో కాంగ్రెస్ కార్యకర్తలను నెట్టివేసిన జయరాజన్
- జయరాజన్ పై ఇండిగో 3 వారాల నిషేధం
ఇటీవల జయరాజన్ విమానంలో తోటి ప్రయాణికులపై దౌర్జన్యం చేశారంటూ ఇండిగో సంస్థ ఆయనపై 3 వారాల నిషేధం విధించింది. గత నెల 13న కేరళ సీఎం పినరయి విజయన్ తో కలిసి ఆయన కున్నూర్ నుంచి తిరువనంతపురం వరకు విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు గోల్డ్ స్కాంకు సంబంధించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలిద్దరినీ జయరాజన్ దురుసుగా నెట్టివేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
జయరాజన్ చర్యను ఇండిగో ఆక్షేపించింది. విమానంలో నినాదాలు చేసిన ఆ ఇద్దరు కార్యకర్తలపైనా ఇండిగో 2 వారాలు నిషేధం విధించింది. అటు, ఆ ఇద్దరు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.