Mumbai Indians: మ్యాక్స్‌వెల్ మెరుపులు, హర్షల్ హ్యాట్రిక్.. బెంగళూరు చేతిలో ముంబై చిత్తు

Harshal stars with hat trick as RCB hammer MI
షార్ట్స్‌లో చూడండి
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నిన్న తొలుత కేకేఆర్-సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి చెన్నై అనూహ్య విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై 166 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండర్ ప్రతిభకు తోడు కెప్టెన్ కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

రోహిత్‌శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్, పొలార్డ్, పాండ్యా వంటి వారితో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైకి ఇది ఏమంత పెద్ద స్కోరు కాదు. కానీ, ఇటీవల బ్యాటింగ్ గాడి తప్పడంతో పరాజయాల పాలవుతున్న రోహిత్ సేన 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది.

ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ దెబ్బకు ముంబై బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. హార్దిక్ పాండ్యా (3), కీరన్ పొలార్డ్ (7), రాహుల్ చాహర్ (0)లను వరుస బంతుల్లో వెనక్కి పంపి హ్యాట్రిక్ సాధించాడు. ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. హర్షల్ మొత్తంగా నాలుగు వికెట్లు తీసుకోగా, చాహల్ 3, మ్యాక్స్‌వెల్ 2, సిరాజ్ ఓ వికెట్ తీసుకున్నాడు.

ముంబై బ్యాట్స్‌మన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 43 పరుగులు చేయగా, డికాక్ 24 పరుగులు చేశాడు. 9 మంది ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ముంబైకి ఇది ఆరో పరాజయం కాగా, ఆరు విజయాలు సాధించిన కోహ్లీ సేన 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ  కోహ్లీ 51 (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రీకర్ భరత్ 32 (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ 56 (37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
Go Back to Shorts
Mumbai Indians
Royal Challengers Bengaluru
Glenn Maxwell
IPL 2021

More Telugu News