ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడిన రెజ్లర్ సుశీల్ కుమార్
- పంజాబ్ లో అరెస్ట్ చేసిన పోలీసులు
- జూనియర్ రెజ్లర్ హత్య కేసులో సుశీల్ పై ఆరోపణలు
- హత్య తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్
- లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
- రూ.1 లక్ష రివార్డు ప్రకటన
అతడి కోసం 8 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఎట్టకేలకు పంజాబ్ లో పట్టుబడ్డాడు. సుశీల్ కుమార్ కారులో వెళుతుండగా, యూపీలోని మీరట్ టోల్ ప్లాజా వద్ద అతడి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విరివిగా దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో, ఫొటోల ఆధారంగా విశ్లేషణ జరిపిన పోలీసులు సుశీల్ పంజాబ్ దిశగా వెళ్లాడని గుర్తించారు.
పక్కా సమాచారంతో దాడులు చేసి సుశీల్ కుమార్ తో పాటు అజయ్ కుమార్ అనే మరో అనుమానితుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఈ నెల మొదటివారంలో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా మరణించాడు. సాగర్ పై దాడి చేసినవారిలో సుశీల్ కుమార్ కూడా ఉన్నట్టు ఈ కేసులో అరెస్టయిన వారి ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.