Maharashtra: పూణెలో నిండిపోతున్న ఆసుపత్రులు.. వెయిటింగ్‌ ఏరియాలోనే ఆక్సిజన్‌!

Pune is running out of hospitals
షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. ముఖ్యంగా ముంబయి, పూణె, నాగ్‌పూర్‌లలో మహమ్మారి విజృంభిస్తున్న తీరు బెంబేలెత్తిస్తోంది. పూణెలో పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు పూర్తిగా నిండిపోయాయి. కొత్తగా వచ్చి చేరుతున్న వారికోసం తాత్కాలిక గదులు ఏర్పాట్లు చేసి చికిత్స అందించాల్సిన అవసరం ఏర్పడుతోందంటే అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పింప్రిలోని ఆసుపత్రిలో వెయిటింగ్‌ ఏరియాలోనూ బాధితులకు ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పింప్రిలోని యశ్వంత్‌రావ్‌ చవాన్‌ మెమోరియల్‌ ఆసుపత్రి సామర్థ్యం 400 పడకలు. వీటిలో 55 ఐసీయూ పడకలు. అయితే, ఇవన్నీ ప్రస్తుతం కొవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. అయినా, తాకిడి మాత్రం తగ్గడం లేదు. బాధితుల పరిస్థితి అర్థం చేసుకొన్న వైద్యులు తాత్కాలిక ఏర్పాట్లు చేసి చికిత్స అందజేస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారికి వెయిటింగ్‌ ఏరియాలోనే ఆక్సిజన్‌ అందిస్తున్నారు.

పూణె వ్యాప్తంగా కేవలం 79 మాత్రమే వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న పడకలు ఉన్నాయి. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది.

సోమవారం పూణెలో 8,075 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు రికార్డయిన కేసుల సంఖ్య 5.8 లక్షలకు చేరింది. ఒక్క పింప్రి-చించ్వాడ్‌ ప్రాంతంలోనే  2,152 కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో కరోనాతో కొట్టుమిట్టాడుతున్న నగరాల్లో పుణె కూడా ఒకటి.
Go Back to Shorts
Maharashtra
Corona Virus
COVID19
pune

More Telugu News