ముంబైని చిత్తు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన హైదరాబాద్.. కోల్‌కతా ఆశలపై నీళ్లు

Sun Risers Hyderabad defeated Mumbai by 10 wickets
ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చెలరేగింది. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముంబై వరుస విజయాలకు కళ్లెం వేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. హైదరాబాద్ ఓటమి కోసం ఎదురుచూసిన కోల్‌కతాకు నిరాశ ఎదురుకావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. షార్జా వేదికగా గత రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగులో రాణించిన వార్నర్ సేన, తర్వాత బ్యాటింగులోనూ అదిరిపోయే ప్రదర్శన చేసింది. ముంబైని 149 పరుగులకే కట్టడి చేసిన ఎస్ఆర్‌హెచ్.. ఆ తర్వాత వికెట్ నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది.

ముంబై నిర్దేశించిన 150 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అద్భుత విజయాన్ని అందుకుంది. వికెట్ల కోసం ముంబై బౌలర్లు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓపెనర్లు వార్నర్, వృద్ధిమాన్ సాహాలు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా యథేచ్ఛగా ఆడారు. బౌండరీలతో విరుచుకుపడ్డారు. 58 బంతులు ఆడిన వార్నర్ 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 85 పరుగులు చేయగా, 45 బంతులు ఎదుర్కొన్న సాహా 7 ఫోర్లు, సిక్సర్‌తో 58 పరుగులు చేశాడు. ఫలితంగా మరో 17 బంతులు మిగిలి ఉండగానే పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో డికాక్ (25), సూర్యకుమార్ యాదవ్ (36), ఇషాన్ కిషన్ (33), పొలార్డ్ (41) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా, హోల్డర్, నదీమ్ చెరో రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన షాబాజ్ నదీమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ముంబైపై ఘన విజయం సాధించడంతో మెరుగైన రన్‌రేట్ కారణంగా బెంగళూరును కిందికి నెట్టి హైదరాబాద్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. కోల్‌కతాకు కూడా 14 పాయింట్లు ఉన్నప్పటికీ రన్‌రేట్ మైనస్‌లలో ఉన్న కారణంగా ఇంటి ముఖం పట్టింది.
Go Back to Shorts
SRH
Mumbai Indians
IPL 2020
playoffs
Kolkata Knightriders

More Telugu News