భారత్‌లో నేపాల్, బంగ్లాదేశ్ తరహా అస్థిరతకు కుట్ర: హరీశ్ సాల్వే సంచలన ఆరోపణలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్‌లో నేపాల్, బంగ్లాదేశ్ తరహా అస్థిరతకు కుట్ర: హరీశ్ సాల్వే సంచలన ఆరోపణలు

Harish Salve claims conspiracy to create Nepal and Bangladesh style instability in India
  • భారత్‌లో నేపాల్, బంగ్లాదేశ్ వంటి పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నాలు
  • నిరసనల వెనుక విదేశీ శక్తులు, నిధులు ఉన్నాయని అనుమానం
  • మోదీ ప్రభుత్వ పురోగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు
  • ఇవి ప్రజా ఉద్యమాలు కావని, ఎక్కువ కాలం నిలవవని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
భారతదేశంలో నిరసనల పేరుతో నేపాల్, బంగ్లాదేశ్‌లో మాదిరిగా అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ అడ్వకేట్, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అశాంతిని రెచ్చగొట్టడంలో విదేశీ శక్తుల పాత్ర ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 'ఐఏఎన్ఎస్' వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొన్ని నిరసన కార్యక్రమాలకు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని తాను విశ్వసిస్తున్నట్లు సాల్వే తెలిపారు. ప్రభుత్వ పురోగతిని అడ్డుకోవడానికి కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని, ప్రదర్శనల కోసం ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ఆయన ప్రశ్నించారు. 

పొరుగు దేశాల్లో రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ.. "నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన గందరగోళం వెనుక ఎవరున్నారనే దానిపై సందేహం ఉందా? నా అభిప్రాయం ప్రకారం, ఈ సంఘటనల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయి" అని అన్నారు.

భారత్‌లోనూ అలాంటి ధోరణే కనిపిస్తోందని, దీప్కే, సౌరవ్ దాస్ వంటి కొందరు ఆకస్మికంగా నిరసనలకు నాయకులుగా ముందుకొస్తున్నారని సాల్వే ఆరోపించారు. జర్మనీ వంటి దేశాల్లో నివసించే కొందరు ఇక్కడ ఎలా నాయకులుగా చలామణి అవుతున్నారని, ఈ కార్యకలాపాలకు వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.

గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పనులను అడ్డుకోవడానికేనని స్పష్టమవుతోందని సాల్వే అన్నారు. "మోదీ ప్రభుత్వం హ‌ర్మూజ్ జలసంధి సంక్షోభం, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి వంటి అంశాలపై దృష్టి సారిస్తుంటే, ఈ గ్రూపులు ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నాయి" అని ఆయన వివరించారు. విదేశీ నిధుల ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయితే, జరుగుతున్న నిరసనలను తాను ప్రజా ఉద్యమంగా భావించడం లేదని సాల్వే స్పష్టం చేశారు. యూట్యూబ్ వీడియోలు, రీల్స్ ద్వారా తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది నిజమైన ప్రజా ఉద్యమం కానందున ఎక్కువ కాలం నిలవదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వ్యవస్థను అస్థిరపరిచే ఇలాంటి ఉద్యమాలతో వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Harish Salve
Foreign funding
India destabilization conspiracy
Bangladesh Nepal protests
Modi government
External forces interference

More Telugu News