మనం ఇంకా సిద్ధం కాలేదు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలి: బిల్ గేట్స్ అనూహ్య వ్యాఖ్యలు

మనం ఇంకా సిద్ధం కాలేదు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలి: బిల్ గేట్స్ అనూహ్య వ్యాఖ్యలు

Bill Gates unexpected comments on slowing down AI development speed
  • ఏఐ వృద్ధి నియంత్రణ అవసరమని పిలుపునిచ్చిన బిల్ గేట్స్
  • ఇంతటి భారీ మార్పుకు మనం సిద్ధంగా లేమని వ్యాఖ్య
  • సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరిక
  • ఏఐపై ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్
  • సమానత్వం కోసం ఏఐపై 1 బిలియన్ డాలర్లు కేటాయించిన గేట్స్ ఫౌండేషన్
టెక్నాలజీ రంగంలో ఎల్లప్పుడూ అగ్రగామిగా నిలిచే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఏఐ' పురోగతి వేగాన్ని కొంతమేర తగ్గించాల్సిన అవసరం ఉందని, ఈ సాంకేతికత తీసుకురాబోయే భారీ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక అంశాలను పంచుకున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గతంలోని పర్సనల్ కంప్యూటర్లు లేదా ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణల కంటే భిన్నమైనదని, ఇది సమాజంలో లోతైన మార్పులకు కారణమవుతుందని బిల్ గేట్స్ వివరించారు. 

"ఇంత వేగవంతమైన, విస్తృతమైన మార్పులకు మనం ఇంకా సంసిద్ధం కాలేదు. నిరంతరం ఆవిష్కరణలను ప్రోత్సహించే నేనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో ఏఐ ఆధారిత సైబర్ దాడుల రూపంలో పెను ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మోడల్స్ నియంత్రణ కోల్పోయినట్లు వార్తలు వచ్చిన 'హగ్గింగ్ ఫేస్ ఘటన'ను ఆయన ప్రస్తావించారు.

ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ వంటి టెక్ దిగ్గజాలు సైతం ఏఐ అభివృద్ధి వేగం పట్ల ఇటువంటి ఆందోళనలనే వ్యక్తం చేశారు. ఇప్పుడు బిల్ గేట్స్ కూడా వారి వాదనతో ఏకీభవించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు, ఏఐ వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని గేట్స్ ఫౌండేషన్ విశ్వసిస్తోంది. తమ 'గోల్‌కీపర్స్ రిపోర్ట్'లో పేర్కొన్నట్లుగా, ఏఐని సరైన మార్గంలో నడిపిస్తే, అది సామాజిక సమానత్వాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనంగా మారుతుందని వెల్లడించింది. ఈ దిశగా, సమానత్వంతో కూడిన ఏఐ అభివృద్ధి కోసం తమ ఫౌండేషన్ 1 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు స్పష్టం చేసింది.
Advertisement
Bill Gates
Artificial Intelligence
AI development speed
Gates Foundation
AI cyber threats

More Telugu News